హత్య, దోపిడీ కేసులో నిందితురాలి అరెస్టు

23 Nov, 2018 13:07 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న క్రైం డీసీపీ రాజకుమారి, నిందితురాలి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించిన వైనం

విజయవాడ : ఓ మహిళను హత్య చేసి ఆపై దోపిడీకి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత మార్చి 23వ తేదీన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏరియాలో న్యూ ఆర్‌ఆర్‌. పేట రోడ్డు, ఫార్చూన్‌ హైట్స్‌ ఆపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నెం.305లో జరిగిన మహిళ హత్య, దోపిడీ కేసులో నిందితురాలిని సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి రూ.2.50 లక్షల విలువైన 84 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బందర్‌ రోడ్డులో కంట్రోల్‌ కమాండ్‌ రూంలో క్రైమ్‌ డీసీపీ బి. రాజకుమారి విలేకరులకు వివరాలను వెల్ల డించారు. ప్లాట్‌ నెం.305లో ఒంటరిగా నివసిస్తున్న పేరం నాగమణి (57) ని ఎదురింట్లో ఉంటున్న మహ్మద్‌ ఆసియా బేగం అలియాస్‌ బేగం (46) హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుంది. నాగమణికి తన ఇంటి ముందున్న అసియా బేగంతో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో ఆసియా బేగంకు భర్తతో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కలహాల్లో నాగమణి జోక్యం చేసుకుంది. ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆసియా బేగం ఆమె భర్తకు గొడవ జరిగింది. ఈ గొడవలో నాగమణి జోక్యం చేసుకుని మార్చి 23వ తేదీన ఆసియా బేగం ఫ్లాట్‌లోకి వెళ్లింది. నీవు నీ భర్తకు సొంత భార్యవా, లేక ఉంచుకున్నదానివా.. అంటూ ఆసియా బేగంను నాగమణి ప్రస్తావించింది. ఆ మాటలకు కోపంతో నాగమణి జుట్టు పట్టుకుని ఎదురుగా ఉన్న గోడకు బలంగా కొట్టింది. నాగమణికి తల వెనుక భాగంలో బలంగా దెబ్బ తగలడంతో కిందిపడిపోయింది.

ఎంతసేపటికి నాగమణి లేవకపోవటంతో ఆమె మృతి చెందినట్లు భావించింది. దీంతో కంగారు పడిన ఆసియాబేగం.. నాగమణిని ఆమె ఇంట్లోని బెడ్‌ రూంకు తీసుకెళ్లింది. చున్నీతో ఆత్మహత్య చేసుకున్నట్లు సృష్టించింది. మృతురాలి ఇంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కూడా అపహరించుకుపోయింది. ఏమీ తెలియనట్లు ఇంటికి తాళం వేసేసింది. క్రైమ్‌ ఏసీపీ మక్చూల్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. ఎదురింటి ఆసియా బేగంపై అనుమానంతో సత్యనారాయణపురం రైతుబజార్‌ వద్ద ఆసియా బేగంను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం బయట పడింది. దాంతో నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. విలేకరుల సమావేశంలో క్రైమ్‌ ఏసీపీలు మక్చుల్, వర్మ, సుందరరాజు తదితరులు పాల్గొన్నారు. సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసు దర్యాప్తు చేశారు. 

మరిన్ని వార్తలు