కట్నం వేధింపులకు తాళలేక..

13 Aug, 2018 16:36 IST|Sakshi
మార్చురీ వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు, వివాహిత మృతదేహం(ఇన్‌సెట్‌)

సిద్దిపేటటౌన్‌ : అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సిద్దిపేట అర్బన్‌ మండలంలోని తడ్కపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్‌ మండలంలోని రాగట్లపల్లికి చెందిన అన్నపూర్ణను తడ్కపల్లి గ్రామానికి చెందిన అశోక్‌కు ఇచ్చి 2017 ఫిబ్రవరి 19న వివాహం జరిపించారు. భారత సైన్యంలో సైనికునిగా పనిచేస్తున్నాడు. పెళ్‌లైన మూడు నెలల వరకు బాగానే ఉన్న అత్తమామలు మూడు నెలల తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధించసాగారు. అశోక్‌ సెలవులు ముగిసిన అనంతరం విధుల నిర్వహణకు జమ్మూకాశ్మీర్‌కు వెళ్లాడు.

అశోక్‌ లేకపోవడంతో అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత అన్నపూర్ణను అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని చెప్పి పుట్టింటికి పంపించారు. దీంతో మొదట ఇచ్చిన కట్నానికి తోడు మరో లక్ష రూపాయలు ఇచ్చి అన్నపూర్ణను అత్తింటికి పంపించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బాగానే చూసుకున్న అత్తింటి వారు మళ్లీ వేధింపులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో అన్నపూర్ణ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిందని అత్తమామలు మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. మృతురాలి అత్తమామలు, కుటుంబ సభ్యుల సాయంతో మృతదేహాన్ని ఆదివారం ఉదయం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి మార్చురీ వద్ద వేసి తిరిగి ఇంటికి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు.

పని చేసుకుంటేనే పూట గడిచే పరిస్థితి తమదని అయినా కూతురు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో పెళ్లి సమయంలో రూ. 6 లక్షల కట్నంకు తోడు 12 తులాల బంగారం, బైక్‌ కట్నంగా ఇచ్చామని భాదితురాలి తండ్రి పోచయ్య తెలిపారు. మరో సారి కట్నం కావాలంటే అప్పు చేసి డబ్బులు ఇచ్చామని, అయినా తమ కూతురిని వేధించడం మానలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కూతురిని అత్తమామలు, కుటుంబ సభ్యులు కలిసి గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తమ కూతురుని పొట్టన పెట్టుకున్న వారిని శిక్షించాలని పోలీసులను కోరారు. పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్‌ ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు