పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య 

15 Nov, 2019 10:17 IST|Sakshi

సాక్షి, నాయుడుపేట(నెల్లూరు) : ఆ యువతి ఏ కష్టం వచ్చిందో.. ఏమో.. ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందింది. అయితే ఈ యువతి నెల్లూరులో పోలీసులకు తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు చేసుకున్నట్లు మరణ వాంగ్మూలం సైతం ఇచ్చింది. ఈ ఘటన నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓజిలి మండలం వెంకటరెడ్డిపాళెం పంచాయతీ పరిధిలోని బత్తలపురం గ్రామానికి చెందిన చిట్టేటి గురువయ్య, అల్లెమ్మల కుమార్తె శ్రావణి(21). ఆమెకు ఏడాది వయస్సులోనే తల్లిదండ్రులు మృతిచెందారు. చిన్నతనం నుంచి పుదూరులో ఉన్న అమమ్మ–తాతయ్యల వద్దే శ్రావణి ఉండేది. ఆ యువతికి వారి సమీప బంధువైన పుదూరు గ్రామానికి చెందిన వెలుగు చెంచయ్య కుమారుడు గురుశేఖర్‌తో సెప్టెంబర్‌ 30వ తేదీన పెద్దల సమక్షంలో వివాహమైంది.

కాగా, యువతి ఈ నెల 12వ తేదీన ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్‌ వైద్యశాలలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో అక్కడి వైద్యులు వెంటనే చెన్నైకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బుధవారం రాత్రి చెన్నైలోని జీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా మృత్యువాత పడినట్లు తెలిపారు.

ఈ మేరకు మృతురాలి తాత వెలుగు నాగయ్య శ్రావణి కడుపునొప్పి తాళలేక ఇంటి వద్ద ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి వివాహం జరిగి 45 రోజులు కావడంతో ఆమె మృతిపై స్థానిక తహసీల్దారుకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల సమక్షంలో చెన్నైలోని జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి పంచానామా జరిపి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే శ్రావణికి ఇష్టం లేని పెళ్లి చేసి ఆమె మృతికి కారకులైనారని బత్తలపురం గ్రామానికి చెందిన శ్రావణి తండ్రి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.   

మరిన్ని వార్తలు