సన్నిహితుడే హంతకుడు!

4 Jun, 2019 12:50 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న గిల్టు నగలు, కత్తి

మహిళ హత్య కేసులో వీడిన చిక్కుముడి

బంగారు ఆభరణాల కోసం హత్య

సీసీ పుటేజ్‌ల ఆధారంగా నిందితుడి గుర్తింపు

అరెస్ట్‌ చేసిన బాలాజీనగర్‌ పోలీసులు

సిబ్బందిని అభినందించిన ఎస్పీ ఐశ్వర్యరస్తోగి

నెల్లూరు(క్రైమ్‌): ఓ మహిళను దుండగుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకెళ్లాడు. అయితే హత్య కేసును ప్రమాద ఘటనగా చిత్రీకరించేందుకు మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటన ఇటీవల నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో సంచలనం రేకెత్తించింది. అసలు ఎందుకు హత్య చేశారన్న మిస్టరీ పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్‌లు, టవర్‌ లొకేషన్‌ తదితరాల ఆధారంగా మిస్టరీని చేదించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఘటనకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు.

బి.నిర్మలాబాయి(45) ఓ ప్రైవేట్‌ పాఠశాలలో క్లర్క్‌గా పనిచేస్తూ రామలింగాపురం ఒకటో వీధిలో నివాసం ఉంటోంది. ఆమె భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె తిరుపతిలో చదువుకుంటోంది. నిర్మలాబాయి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమెకు అరవిందనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ రామస్వామి అలియాస్‌ వి.శ్రీకాంత్‌ అలియాస్‌ రజనీకాంత్‌తో పరిచయం అయింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. 6 నెలల నుంచి రామస్వామి నిర్మలాబాయి ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన రామస్వామి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తన సంపాదన అంతంతమాత్రంగానే ఉండడంతో అప్పుల వారి ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఎలాగోలా డబ్బు సంపాదించి అప్పులు చెల్లించాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి నిర్మలాబాయి ఒంటిపై ఉన్న నగలపై దృష్టి పడింది. వాటిని ఎలాగైనా తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అవసరమైతే ఆమెను చంపి వాటిని తీసుకొని అమ్మి సొమ్ముచేసుకోవాలని పన్నాగం పన్నాడు. అదును కోసం వేచి చూడసాగాడు.

హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఐశ్వర్యరస్తోగి
హత్య చేసి నగలతో ఉడాయింపు
మే 28వ తేదీ సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వెళుతున్న నిర్మలాబాయిని రామస్వామి కలిశాడు. అనంతరం ఆమెతోపాటు ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. అనంతరం తన వద్దనున్న కత్తిని పరుపు కింద పెట్టి ఆమెతో శారీరకంగా కలిశాడు. అనంతరం ఆమె ఛాతిపై కూర్చొని కత్తితో మెడపై 15 సార్లు విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఆమె మెడలో ఉన్న దండ, 4 గాజులు తీసుకున్నాడు. చెవులకున్న కమ్మలు రాకపోవడంతో కత్తితో చెవులు కోసి కమ్మలను తీసుకున్నాడు. నిర్మలాబాయి పర్సులో ఉన్న రూ.2 వేల నగదును తీసుకుని, బీరువాలో నగదు కోసం శోధించాడు. అక్కడ ఏమీ దొరకలేదు. ఏమీ లేకపోవడంతో పరుపుపై ఉన్న న్యూస్‌ పేపర్లను తగులబెట్టి మృతదేహంపై వేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న గ్యాస్‌ లీక్‌ చేసి అగ్నిప్రమాదంగా చిత్రీకరించి అక్కడ నుంచి పరారయ్యాడు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి మెడపై విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లు గుర్తించారు. చెవులు తెగి ఉండడంతో నగదు కోసమే హత్య చేశారని నిర్ధారణకు వచ్చారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ మర్డర్‌ఫర్‌ గెయిన్‌ కింద కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసులోని మిస్టరీని చేధించేందుకు చర్యలు చేపట్టారు.

సిబ్బందికి అభినందన
మిస్టరీగా మారిన హత్య కేసును చేధించి నిందితుడిని అరెస్ట్‌ చేసిన నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌బాబు, ప్రత్యేక బృందంలోని సిబ్బంది ప్రసాద్, సుధాకర్, జిలాని, ప్రభాకర్, ప్రభుదాస్, మోహన్‌కృష్ణ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.

నిందితుడిని గుర్తించింది ఇలా..
హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులకు చిన్నపాటి క్లూ కూడా లభించలేదు. దీంతో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మృతురాలు పనిచేసే స్కూల్‌ నుంచి ఇంటి వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. పుటేజ్‌లో ఓ ఆటో(ఆటో వెనుక భాగంలో రజనీకాంత్‌ ఫొటో ఉన్న)ను పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ఆటో నిర్మలాబాయి ఇంటి వద్ద ఉండడంపై పోలీసులు సదరు ఆటోలోని వ్యక్తికి ఏమైనా సంబంధాలున్నాయా అని అనుమానాలు రేకెత్తడంతో ఆటోకు సంబంధించిన వివరాలు సేకరించారు. దీంతోపాటు హత్య జరిగిన సమయం, అంతకు ముందు టవర్‌ డంప్‌ను కూడా పరిశీలించారు. ఆటోలోని వ్యక్తే ఈ దురాగతానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చి హత్య జరిగిన అనంతరం నుంచి ఆ ఆటో ఎక్కడెక్కడికి వెళ్లింది. ఎక్కడ ఉందన్న విషయాలు సీసీ కెమెరాల పుటేజ్‌ల ద్వారా సేకరించారు. సదరు ఆటో బంగారు ఆభరణాల విక్రయ దుకాణం వద్దకు వెళ్లడాన్ని సైతం పోలీసులు గుర్తించి సదరు ఆటో కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రజనీకాంత్‌ స్టిక్కర్‌ ఉన్న ఆటోలన్నింటినీ పరిశీలించి చివరకు ముత్తుకూరు రోడ్డులోని అపోలో హాస్పిటల్‌ జంక్షన్‌లో నిందితుడు రామస్వామిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు హత్యకు దారితీసిన పరిస్థితులు వెల్లడించాడు. నగల కోసం ఆమెను నిందితుడు హత్య చేయగా వాటిని విక్రయించే క్రమంలో అవి రోల్డ్‌గోల్డ్‌వని తేలడంతో అతను నిర్ఘాంతపోయాడు.

రామస్వామి లీలలెన్నో..
ఆటోడ్రైవర్‌గా ఉంటూ రామస్వామి ఎందరో మహిళలు, యువతులను ట్రాప్‌ చేసి తన అవసరాలను తీర్చుకుంటున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. రామస్వామి శారీరకంగా(రెండు కాళ్లకు పోలియో) దివ్యాంగుడు. అయినప్పటికీ తన ఆటోలో ఎక్కిన మహిళలను, యువతులను మాటలతో మాయ చేసి వారిని శారీరకంగా అనుభవించేవాడు. ఆ క్రమంలోనే నిర్మలాబాయి అతనికి పరిచయమైంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక సైతం అతని మాటలకు మోసయిందని పోలీసులు గుర్తించి ఆమె తల్లిదండ్రులను పిలిపించి అప్రమత్తం చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు