మోసపోయా.. న్యాయం చేయండి

21 Aug, 2019 10:12 IST|Sakshi
మదనపల్లె డీఎస్పీ ఆఫీసు వద్ద చంటి బిడ్డతో నిరసనకు దిగిన అరుణ 

సాక్షి, మదనపల్లె టౌన్‌ : పెద్దలను ఎదిరించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా..తనకు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇప్పుడు తన భర్త కాపురానికి రాకుండా మోసం చేస్తున్నాడు. పిల్లలు పుట్టాక ఇప్పుడు తనకు వద్దని బాధిస్తున్నాడు. న్యాయం చేయండంటూ మంగళవారం ఓ యువతి చంటి బిడ్డతో మదనపల్లె డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా చిట్వేలి మండలం, చెర్లోపల్లెకు చెందిన నరసయ్య, జయలక్ష్మిల కుమార్తె అరుణ(23) కడపలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసేది. ఈ క్రమంలో కేవీ పల్లె మండలం, చీనేపల్లె గ్రామం, గుండ్రవారిపల్లెకు చెందిన ప్రతాప్‌ రెడ్డితో ప్రేమలో పడింది.

ఇద్దరు మూడేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి కర్ణాటకలో కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. అయితే ప్రతాప్‌రెడ్డి అరుణను డబ్బులు తీసుకు వస్తే వ్యాపారం ప్రారంభించి బతుకుదామని చెప్పాడు. అరుణ డబ్బులు సమకూర్చలేక పోవడంతో ఆమెను ప్రియుడు కొంతకాలం క్రితం వదిలేశాడు. దీంతో చేసేది లేక అరుణ కేవీపల్లె పోలీసులను ఆశ్రయించింది. భర్తతో తన కాపురాన్ని నిలబెట్టాలని కోరింది. అక్కడి పోలీసులు ప్రతాప్‌ రెడ్డిని, అరుణను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా వారి కాపురం చక్కబడక పోవడంతో చేసేది లేక బాధితురాలు అరుణ న్యాయం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం మదనపల్లె డీఎస్పీ కోసం వచ్చింది. ఆ సమయంలో డీఎస్పీ రవి మనోహరాచారి అందుబాటులో లేక పోవడంతో ఇన్‌ఛార్జి డీఎస్పీ(ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ) వంశీధర్‌ గౌడ్‌ను కలిసింది.

డీఎస్పీ కేవీపల్లె పోలీసులతో మాట్లాడగా ఇప్పటికే కేసు నమోదుచేశామని వారు  చెప్పారు. ఈ విషయాన్ని అరుణకు డీఎస్పీ వివరించినా ఆమె వినకుండా తనకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ ఆఫీసు వద్దనే కూర్చుని నిరసనకు దిగింది. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా..అరుణ ఫిర్యాదు మేరకు ఇదివరకే ఇద్దరిని కేవీపల్లె స్టేషన్‌కు పిలిపించి కలపడానికి ప్రయత్నించామన్నారు. అయితే ఆమె కాస్త ఓపిక పట్టకుండా రోజూ ఎస్పీ, డీఎస్పీ ఆఫీసుల చుట్టు తిరుగుతోందన్నారు. భర్తతో కాపురం చేయించాలని ఆమె కోరుతోందదని అది తమ చేతుల్లో లేదని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు