వలంటీర్‌గా ఎన్నికై.. అంతలోనే

22 Aug, 2019 10:15 IST|Sakshi

సాక్షి, పెడన(కృష్ణా) : మండలంలోని కంచాకోడూరుకు చెందిన యువకుడి ఆత్మహత్యపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అందించిన వివరాలు.. ఐటీఐ చదివిన గోపీచంద్‌ మచిలీపట్నం బెల్‌ కంపెనీలో గతరెండు నెలలుగా అప్రెంటీస్‌ చేస్తున్నాడు. మంగళవారం తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన గోపిచంద్‌ను గమనించిన స్థానికులు కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

గోపిచంద్‌ ఇటీవల గ్రామ వలంటీరుగా నియమితుడవ్వడంతో బెల్‌ కంపెనీలో అప్రెంటీషిప్‌ను వదిలేశాడు. గతంలో తనతో పనిచేసిన ముగ్గురు యువకులు ఒక సెల్‌ఫోన్‌ విషయంలో వివాదం జరిగినట్లు తనకు చెప్పినట్లు గోపిచంద్‌ తండ్రి శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు యువకులు మంగళవారం గోపిచంద్‌ ఇంటికి వచ్చి కొట్టి గాయపరచి, బెదిరించినట్లు శ్రీనివాసరావు ఆరోపించాడు. బెదిరింపులకు భయపడి తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిర్వహించినట్లు ఏఎస్‌ఐ కె.ఎం.ఎం.వర్మ తెలిపారు.  

మరిన్ని వార్తలు