రిక్రూటర్‌ను మెప్పించే రెజ్యుమె ఇలా!

3 Sep, 2014 00:43 IST|Sakshi
రిక్రూటర్‌ను మెప్పించే రెజ్యుమె ఇలా!

జాబ్ స్కిల్స్: ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడగానే అభ్యర్థులు చేసే పని.. తమ వివరాలతో కూడిన రెజ్యుమెను రూపొందించుకొని, సంస్థకు పంపించడం. ఇంటర్వ్యూ పిలుపు కోసం ఎదురుచూడడం. రెజ్యుమె దశనుంచే వడపోత కొనసాగుతుంది. ఆకర్షణీయంగా లేని వాటిని రిక్రూటర్‌లు పక్కనపెడతారు. తమకు నచ్చిన రెజ్యుమెల అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. కొలువు వేటలో అత్యంత కీలకమైంది.. రెజ్యుమె. పర్ఫెక్ట్ రెజ్యుమె అనేదానిపై రిక్రూటర్ల అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చు. వ్యక్తులను బట్టి దృష్టికోణం మారుతుంది. ఒక్కో రెజ్యుమెపై సంస్థ యాజమాన్యాలు వెచ్చించే సమయం సగటున కేవలం 6 సెకండ్లేనని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యవధిలోనే అభ్యర్థులు తగిన వారా? కాదా? అనే విషయం తేల్చేస్తారు. కాబట్టి తక్కువ సమయంలోనే రిక్రూటర్‌ను కట్టిపడేసే రెజ్యుమెను తయారు చేసుకుంటే ఇక తిరుగుండదు. ఇందులో ఎలాంటి పదాలు వాడాలి. ఎలాంటి పదాలు వాడకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
 
 వాడాల్సిన పదాలు
 కంపెనీ యాజమాన్యం దృష్టిని వెంటనే ఆకర్షించే పదాలు కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకొని, రెజ్యుమెలో ఉపయోగించాలి. ఎక్స్‌పీరియెన్స్, మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్, డెవలప్‌మెంట్, బిజినెస్, స్కిల్,  ప్రొఫెషనల్, నాలెడ్జ్, టీమ్, లీడర్‌షిప్ వంటి పదాలతో కూడిన రెజ్యుమెలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు సర్వేలో స్పష్టమైంది. సాధారణ రెజ్యుమెల కంటే ఇవి రిక్రూటర్‌ను 70 శాతం అధికంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది.
 
 వాడకూడని పదాలు
 యాజమాన్యాలకు నచ్చని పదాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు వాటిని పరిహరించడమే మంచిది. మీ, మైసెల్ఫ్, నీడ్, ఛాన్స్, హార్డ్, ఫస్ట్, లెర్నింగ్ వంటి పదాలున్న రెజ్యుమెలను రిక్రూటర్లు పక్కనపడేస్తున్నారని సర్వేలో బయటపడింది. ఇలాంటి రెజ్యుమెలు 79 శాతం తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని స్పష్టమైంది. ఉద్యోగాల సాధనలో ఇవి ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి.
 
 వేటిని చేర్చాలి?
 రెజ్యుమె నిర్మాణాత్మకంగా ఉండడానికి, ప్రొఫెషనల్‌గా కనిపించడానికి అందులో కొన్ని విభాగాలను తప్పనిసరిగా చేర్చాలి. ఆబ్జెక్టివ్, సమ్మరీ, వర్క్ హిస్టరీ, ట్రైనింగ్, అఛీవ్‌మెంట్స్ వంటి వాటిని పొందుపర్చాలి. దీనివల్ల అభ్యర్థులకు అవకాశాలు మెరుగవుతాయి.
 
 చేర్చకూడనివి
 పాతకాలం రెజ్యుమెల్లో కొన్ని విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించేవారు. ఇప్పుడు ఇలాంటి వాటికి యాజమాన్యాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలిసిన భాషలు, వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచుల గురించి ప్రస్తావించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని రెజ్యుమెలో చేర్చకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి వాటితో కూడిన రెజ్యుమెలో రిక్రూటర్‌ను 24 శాతం తక్కువగా మెప్పిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

మరిన్ని వార్తలు