అమెరికాలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ హిందీ సమ్మేళనం

5 Apr, 2015 19:03 IST|Sakshi
అంతర్జాతీయ హిందీ సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖులు

న్యూయార్క్: న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్స్ విశ్వ విద్యాలయం, న్యూయార్క్లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం స్థానిక రాత్గేర్స్ విశ్వవిద్యాలయంలో ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనంలో  ప్రపంచంలో హిందీ భాష ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని ఎలా అధిగమించాలో   చర్చిస్తారు.   భారత దౌత్య అధికారి జ్జ్ఞానేశ్వర్ ములే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం హిందీ భాషకు అగ్ర స్థానం కల్పిస్తున్నదని చెప్పారు.   విదేశాలలో సైతం మోదీ హిందీలోనే ప్రసంగాలు చేస్తున్నారన్నారు.  

హిందీ మాతృభాషగా కలిగిన వివిధ ప్రాంతాల వారు, హిందియేతర ప్రాంతాల రచయితలు వారి రచనలను, అదేవిధంగా విదేశాల నుండి వెలువడుతున్న హిందీ సాహిత్యానికి, భారత దేశంలో సముచిత స్థానం కల్పించకపోతే హిందీ ఎప్పటికీ విశ్వ భాష కాదని, కేవలం భారత దేశంలోని 10 రాష్ట్రాలకే  పరిమితం అవుతుందని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హెచ్చరించారు. ప్రయాగలోని త్రివేణి సంగంలో కనిపించని సరస్వతి నదితో పాటు గంగ, యమునల
సంగమాన్ని భారతీయులు అందరు భక్తీ భావనతో చూస్తారని చెప్పారు.  కానీ దక్షిణాదిలో వున్న కన్యాకుమారిలో మూడు సముద్రాలూ సంగమమై  ఉన్నాగాని దక్షిణ భారత దేశపు ప్రాశస్త్యతను ఉత్తరాది వారు గుర్తించడం లేదని చెప్పారు. అదే విధంగా దక్షిణాదికి చెందిన రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు వంటి వారి ఆధ్యాత్మిక ప్రసంగాలే లేకపోతే హిందీ సాహిత్యంలోని స్వర్ణయుగంగా భావించబడే భక్తి సాహిత్యానికి మనుగడే వుండేది కాదని లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నల్ల సత్యనారాయణ, హిందీ భాష సాహిత్యానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం  చేస్తున్న సేవలను వివరించారు.  చార్లెస్ మాబ్రేల్స్, అషార్ దత్తర్, అమెరికాలోని భారతీయ విద్యా భవన్కు చెందిన  డాక్టర్ సి.కె. రావు, జయరామన్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం హిందీ ఆచార్యులు, న్యూయార్క్లోని హిందీ ఆచార్యులు డాక్టర్ గార్నెని,  డాక్టర్ వితూరి పొవెల్, హిందీ సంఘం ఫౌండేషన్ చైర్మన్ అశోక్ ఓజా, ఆంధ్ర విశ్వవిద్యాలయంకు చెందిన నల్లా సత్యనారాయణతో సహా అమెరికా, కెనడా, బ్రెజిల్, భారత దేశానికి చెందిన 200 మంది  నిష్ణాతులైన ఆచార్యులు ఇందులో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు