సినారేకి సాహిత్య నివాళులు

28 Jun, 2017 19:21 IST|Sakshi

► ఘనంగా ముగిసిన టాంటెక్స్ 119 వ సాహిత్య సదస్సు


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు జూన్ 18న సాహిత్య  వేదిక సమన్వయకర్త శ్రీమతి శారద సింగిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.  ఈ సదస్సుకు సబ్బని లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు . ప్రవాసంలో నిరాటకంగా 119 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు చేయటం ఈ సంస్థ యొక్క విశేషం.  సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా నిలిచిన ప్రపంచ ప్రఖ్యాత కవి రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి గారికి టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక సభ్యులు, డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అత్యంత ఆసక్తితో పాల్లొని పుష్ప నివాళులు సమర్పించారు.

శ్రీమతి స్వాతి బృందం పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య రచించిన ‘చక్కని తల్లికి చాంగు భళా’, ‘నారాయణతే నమో నమో’  వంటి కీర్తనలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. సి. నారాయణ రెడ్డి రచించిన ‘ కర్పూర వసంతరాయలు’  గ్రంధాన్ని విశ్లేషిస్తూ శ్రీ రమణ జువ్వాడి ప్రసంగించారు. ఆనాటి రాజు కుమార వీరా రెడ్డి రాజ నర్తకి ‘లకుమా దేవి’ని చూసి ఆమె పై కవితలల్లిన తీరును చాలా చక్కగా వివరించారు. సినారే ‘కర్పూర వసంతారాయలు’ లో కేవలం సాహిత్యమే కాక వారి నాట్య శాస్త్ర పరిజ్ఞానాన్ని కూడా చాలా చక్కగా వివరించారు.

శ్రీ పూదూరు జగదీస్వరన్‌ ‘యవని పద్యాలు ముత్యాలు రాలంగ అనీ ‘సినారే భళి భళరే విశ్వంభర కీర్తితో’ అనీ తమ స్వీయ రచనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  వారి మిత్రులు శ్రీ నక్తా రాజు దాన వీర శూర కర్ణ చలన చిత్రంలో  సినారే రాసిన ధుర్యోధనుని సంభాషణలను పోగిడారు. ఈ కార్యక్రమంలో తమ స్వీయ రచనలతో శ్రీ. టి. వరదయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సినారే కవితా సంపుటి ‘ నా రణం మరణం పైనే’  మొదటి ప్రతిని  సినారే చేతులు మీదుగా అందుకున్న  ఆ క్షణాలను, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అంతేకాక సినారే రచించిన ఎన్నో పాటలను స్వయంగా పాడి వినిపించారు. శ్రీ చంద్రహాస్ మద్దుకూరి, ‘పాటలో ఏముంది నామాటలో ఏముంది’ అనే సినారే రచించిన పుస్తకాన్ని పరిచయం చేసి ‘పాటో బయోగ్రఫి’ అనే పదాన్ని చక్కగా విశ్లేషించారు. శ్రీమతి కిరణ్మయి వేముల సినారే రాసిన చలన చిత్ర గీతాలను కలిపి రాసిన స్వీయ కవిత ఆలపించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ ‘ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా ప్రక్రియలు’  అనే అంశం విశ్లేషిస్తూ ప్రసంగించారు. ఈయన వృతి రీత్యా ఉపాధ్యాయులు అయినా సమాజ సేవకుడిగా, పర్యావరణవేత్తగా, సంపాదకులుగా ‘శరత్ సాహితీ కళా స్రవంతి’ , ‘తెలంగాణ సాహిత్య వేధిక’ స్థాపకులుగా ప్రఖ్యాతి చెందారు. ఈయనకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, శేషేంద్ర స్మారక పురస్కారం వంటి పురస్కారాలు వీరి సొంతమయ్యాయి. తెలుగు భాషకి గణిత శాస్త్రానికి వున్న సంబంధాలను, ఒక కవిత ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు కలిగి ఉండాలి అలాగే హైకులు, నానోలు, వాటిలోని లక్షణాలను చాలా చక్కగా వివరించారు.

కొత్తగా కవితలు రాయాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కటి శిక్షణగా అనిపించటం ఒక విశేషం. ఆయన అమోఘమైన పాండిత్య ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. అతిథి ప్రసంగం తరువాత ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీకృష్ణారెడ్డి ఉప్పలపాటి, కార్యవర్గ సభ్యులు తదితరులు  ముఖ్య అతిథి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన ‘అక్షరాణువులు’ పుస్తక ఆవిష్కరణ చేశారు. తదనంతరం ఆయనను సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.



 

మరిన్ని వార్తలు