రాయికోడ్‌ మండలంలో 205 మి.మీ వర్షపాతం

2 Aug, 2016 18:10 IST|Sakshi
జూలై వర్షాలతో హస్నాబాద్‌ చెరువులోకి పుష్కలంగా చేరిన నీరు

రాయికోడ్‌ : మండలంలో జూలై నెలలో 205 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి 225 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్‌లో నిరాశ పరిచిన వర్షాలు జూలైలో ఊరటనిచ్చాయి. జూన్‌ నెలలో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 133 మిల్లీమీటర్లు కురిసింది. జూలై 6న 24 మిల్లీమీటర్లు, 21న 30 మిల్లీమీటర్లు, 22న 80 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

మండలంలో విస్తారంగా కురిసిన వర్షాలతో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. పంటపొలాలు పచ్చగా దర్శనమిస్తున్నాయి. రైతులు ఉత్సాహంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని హస్నాబాద్‌ చెరువు పొంగిపొర్లుతోంది. రెండేళ్లుగా సరైన వర్షాలు లేక కరువును చవిచూసిన జనం చెరువులు నిండటంతో వాటిని వీక్షించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆగష్టులోనూ ఆశించన మేర వర్షాలు కురిసి తమ అంచనాలకు తగ్గట్టుగా పంటల దిగుబడులు రావాలని ఆశిస్తున్నారు. మండలంలో అత్యధికంగా ఈ ఏడాది 7,500 హెక్టార్లలె పత్తి పంటను సాగు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన 14 వేల మంది రైతుల్లో 10 వేల మంది పత్తి సాగు చేశారు. 5 వేల మంది రైతులు 4,500 హెక్టార్లలో సోయాబీన్‌, కంది, పెసర, మినుము, జొన్న తదితర పంటలను సాగు చేశారు.

మరిన్ని వార్తలు