21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ

5 Jun, 2016 06:45 IST|Sakshi
21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ

ఏపీలోని మార్గాల్లో
రూ.22వేల కోట్ల పనులు
రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడి

 సాక్షి, విజయవాడ/తిరుమల: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 21 రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునికీకరిస్తామని రైల్వేమంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. రాష్ట్రం నుంచి వెళ్లే రైలు మార్గాల్లో రూ.22వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.  రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విలేకర్ల సమావేశంలో సురేష్ ప్రభు మాట్లాడుతూ కలకత్తా-చెన్నై, అమరావతి-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఎయిర్ పోర్టులు, పోర్టులను రైల్వే లైన్లకు అనుసంధానం చేసే విషయంపై చర్చించామన్నారు. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్యాలెస్ ఆన్ వీల్స్ తరహాలో రైలును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీని సరుకు రవాణా హబ్‌గా, ఎగుమతులు దిగుమతులు కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేక జోన్‌ను అవకాశం ఉన్నంత వరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  చంద్రబాబు మాట్లాడుతూ రైల్వేమంత్రితో సమావేశంలో రైల్వేలైన్లు, కొత్తరైళ్లు, సరుకు రవాణాకు ఏర్పాట్ల అంశాలపై చర్చించామని తెలిపారు. విభజన చట్టంలోనే ఉన్నందున రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. అంతకుముందు ఉదయం తిరుమల వెళ్లిన రైల్వే మంత్రి  శ్రీవేంకటేశ్వర స్వామివారిని ద ర్శించుకుని మొక్కులు చెల్లించారు.

మరిన్ని వార్తలు