నీదా..నాదా! | Sakshi
Sakshi News home page

నీదా..నాదా!

Published Sun, Jun 5 2016 3:52 AM

నీదా..నాదా! - Sakshi

జెడ్పీ పీఠం
 
టీడీపీలో మరో వివాదం
తెరపైకి జెడ్పీ చైర్మన్ పదవి ఒప్పందం
నేతలను కలుస్తున్న వైస్ చైర్‌పర్సన్ పుష్పావతి
అటువంటి ఒప్పందం లేదంటున్న జెడ్పీ చైర్మన్
తాను ఖర్చు చేసిన మొత్తం వాపస్ ఇస్తే ఇస్తానని కొత్త మెలిక
 

 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో మరో లొల్లి తెరమీదకు వచ్చింది. రాజ్యసభ సీటు విషయంలో రేగిన రగడ కాస్తా చల్లారకముందే... జెడ్పీ చైర్మన్ పీఠంపై చర్చ మొదలయ్యింది. మొదట్లో చేసుకున్న ఒప్పందం మేరకు తనకు రెండేళ్ల తర్వాత జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అప్పగించాలని నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు, జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి విన్నవించినట్టు తెలిసింది. త్వరలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌లను కూడా కలవనున్నట్లు సమాచారం. మరోవైపు అటువంటి ఒప్పందమేదీ లేదని ప్రస్తుత జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తన అనుచరుల వద్ద వాదిస్తున్నట్టు తెలిసింది. అయితే... తాను ఖర్చు పెట్టిన డబ్బులను ఇస్తే పదవిని ఇప్పుడే వదులుకుంటానని రాజశేఖర్ అంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కుదిరిన ఒప్పందం మేరకు ఖర్చు పెట్టిన మొత్తం ఇవ్వాలన్న నిబంధనేదీ లేదని వైస్ చైర్మన్ వర్గీయులు వాదిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో మరో పదవి లొల్లి షురూ అయ్యిందన్నమాట.


 జూలై 7 డెడ్‌లైన్
 జిల్లాలో అధికార పార్టీకి జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదు. అయినప్పటికీ పదవులు, డబ్బు ఆశచూపి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ పార్టీ మారి ఏకంగా చైర్మన్ పీఠాన్ని రాజశేఖర్ దక్కించుకున్నారు. దీనిపై అప్పట్లోనే అధికార పార్టీలో అసంతృప్తి రాజుకుంది. నేరుగా పార్టీ టికెట్లపై గెలిచిన తమను కాదని... వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవి ఎలా ఇస్తారని వాదించారు. అయితే, ప్రస్తుతం కేవలం రెండేళ్ల కాలపరిమితికి మాత్రమే ఆయన జెడ్పీ చైర్మన్‌గా ఉంటారని పార్టీ నేతలు బుజ్జగించారు. రెండేళ్ల తర్వాత మిగిలిన మూడేళ్ల కాలానికి చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తామని వైస్ చైర్మన్‌గా ఉన్న పుష్పావతికి పార్టీ నేతలు అప్పట్లో హామీనిచ్చారని ఈమె వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం మేరకు జూలై 7తో రెండేళ్ల కాలపరిమితి ముగియనున్నందున... జూలై 8 నుంచి తనకు పీఠం అప్పగించాలని ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరినీ కలుస్తున్నట్టు తెలిసింది.
 

Advertisement
Advertisement