రూ.5.78 కోట్లతో కాలువల్లో తూడు తొలగింపు

27 Oct, 2016 00:09 IST|Sakshi
రూ.5.78 కోట్లతో కాలువల్లో తూడు తొలగింపు
శివారు భూములకూ నీరు
ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాంబాబు
పి.గన్నవరం : జిల్లాలో రబీ పంటకు నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా రూ.5.78 కోట్ల వ్యయంతో పంట కాలువల్లో తూడు తొలగింపు పనులు నిర్వహిస్తున్నట్టు ఇరిగేషన్‌ ఎస్‌ఈ బి.రాంబాబు చెప్పారు. పి.గన్నవరం మండలం పోతవరం గ్రామంలో గోరింకల డ్రెయిన్‌పై శిథిలస్థితికి చేరిన బూరుగు కాలువ అక్విడెక్టును బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4 లక్షల 36 వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేస్తున్నారని వివరించారు. కాలువల శివారు ప్రాంతాల్లోని ప్రతి ఎకరం భూమికీ సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని వివరించారు.
రూ.29 లక్షలతో బూరుగు కాలువపై అక్విడెక్టు 
గోరింకల డ్రెయిన్‌పై శిథిలస్థితికి చేరుకున్న  బూరుగుకాలువ అక్విడెక్టు పునర్నిర్మాణానికి రూ.29 లక్షలు మంజూరయ్యాయని ఎస్‌ఈ  చెప్పారు. రానున్న వేసవి క్లోజర్‌లో దీనిని నిర్మిస్తామన్నారు. ఈ కాలువపై 300 ఎకరాల భూమి సాగవుతోందన్నారు. మార్చి 31 వరకూ నీరు అందించి, ఆ తర్వాత అక్విడెక్టు పనులు ప్రారంభించి, జూలై ఒకటి నాటికి పూర్తి చేయాలని రైతులు కోరారు. దీనికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్‌ఈ స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్‌ ఈఈ పి.సుధాకరరావు, పి.గన్నవరం డీఈఈ గంగుమళ్ళ శ్రీనివాస్, ఏఈ వై.కిషోర్‌బాబు, సూర్య కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ పీఎం వినయ్, వాటర్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ చొల్లంగి సత్య నారాయణమూర్తి, రైతు నాయకులు నందెపు సోమేశ్వరరావు, సత్యనారాయణ, సుంకర సూరిబాబు, కోలపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

 

>
మరిన్ని వార్తలు