చిరకాల సమస్యల్ని పరిష్కరించాలి

27 Oct, 2016 00:09 IST|Sakshi
చిరకాల సమస్యల్ని పరిష్కరించాలి
పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
కాకినాడ సిటీ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌(పీఆర్‌టీయూ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం నిరసన తెలిపిన ఉపాధ్యాయులు డిమాండ్లపై కలెక్టరేట్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు రక్షణలేని సీపీఎస్‌ను తక్షణం రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, పది నెలల పీఆర్సీ బకాయిలు నగదుగా చెల్లించాలని, పీఆర్సీ సిఫార్సులన్నింటినీ యథాతథంగా అమలు చేయాలని, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు లోకల్‌ కేడర్‌ను నిర్ణయించి చర్యలు తీసుకోవాలని, గిరిజన, మున్సిపల్, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో భాగస్వామ్యం కల్పించాలని, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు 2015 పీఆర్సీ వేతన స్కేల్‌ వర్తింప చేయాలని, అంతర్గత మూల్యాంకనంలో మార్పులు చేయాలని, జేఏసీ, జాక్టోతో, కుదుర్చుకున్న ఒప్పందాలపై ఉత్తర్వులు  జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్‌వీవీ సత్యనారాయణ, సీహెచ్‌ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని నిరసించారు. ప్రధానంగా నూతన పెన్షన్ విధానం పట్ల లక్షలాది ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో అభద్రత నెలకొందన్నారు. టీవీవీఎస్‌ తిలక్‌బాబు, నీలం వెంకటేశ్వరరావు, వి.భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు