90 టీఎంసీలు గోదావరి పాలు

14 Oct, 2016 12:34 IST|Sakshi

18 రోజుల్లోనే.. వృథాగా పోయిన జలాలు
నీటిని ఒడిసిపడితే జిల్లా సస్యశ్యామలమే!
నిజాంసాగర్‌ :

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని జలాశయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. వాగులు ఉప్పొంగాయి. చెరువులు అలుగులు పారాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మంజీర నదిపై నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టుతో పాటు కౌలాస్‌నాలా, పోచారం, కల్యాణి ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్‌ ద్వారా 18 రోజుల్లో 90 టీఎంసీల నీరు గోదావరి పాలైంది. ఇది నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి సమానం.. ఈ నీటిని ఒడిసి పట్టే ప్రాజెక్టులు ఉండి ఉంటే జిల్లా పూర్తిస్థాయిలో సస్యశ్యామలం అయ్యేది. ఆయా ప్రధాన జలాశయాల ద్వారా సముద్రం పాలైన నీటిని నిల్వచేసుకుని ఉంటే సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. పాలకులు ఆ దిశగా ఆలోచన చేస్తే.. సమీప భవిష్యత్‌లో కామారెడ్డి సస్యశ్యామలం అయ్యే అవకాశాలున్నాయి.


‘సాగర్‌’ నుంచి 76 టీఎంసీలు..
నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులతో 17.8 టీఎంసీలు. వర్షాకాలంలోనూ ఈ ప్రాజెక్టు ఎడారిని తలపించింది. అయితే గతనెలలో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇలా 18 రోజుల వ్యవధిలో 76 టీఎంసీల నీటిని గోదావరిపాలు చేశారు. ఈ నీటితో సుమారు మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేది.


కళ్యాణి, సింగితం ద్వారా 4 టీఎంసీలు..
నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా కళ్యాణి ప్రాజెక్టుతో పాటు సింగితం రిజర్వాయర్‌ నిర్మించారు. వీటి ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 మీటర్లు. ఈ ప్రాజెక్టు వరదగేట్ల ద్వారా 1.5 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.

సింగితం రిజర్వాయర్‌ నీటిమట్టం 416.5 మీటర్లు. ఈ రిజర్వాయర్‌ ద్వారా 2.5 టీఎంసీల నీరు వృథాగా వెళ్లింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే సుమారు మరో నలభై వేల ఎకరాలకు నీరందుతుంది.


కౌలాస్‌ ద్వారా 5 టీఎంసీలు..
జుక్కల్, బిచ్కుంద మండలాల వరప్రదాయిని అయిన కౌలాస్‌నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు(1.23 టీఎంసీలు). ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 5 టీఎంసీల మేర నీరు వృథా అయ్యింది. ఈ నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులు ఉండిఉంటే సుమారు మరో 50 వేల ఎకరాలకు నీరందేది.


పోచారం అలుగు ద్వారా 5 టీఎంసీలు..
నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయిని అయిన పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు(1.82 టీఎంసీలు). ఈ సీజన్‌లో అలుగు ద్వారా 5 టీంఎసీల నీరు వృథా అయ్యింది. ఈ నీటిని నిల్వ చేసుకుని ఉంటే సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందిదే.

మరిన్ని వార్తలు