భారీ స్కెచ్‌.!

12 Aug, 2016 22:56 IST|Sakshi
భారీ స్కెచ్‌.!
సాక్షి,విశాఖపట్నం: మన్యంలో మావోయిస్టులు భారీ స్కెచ్‌ వేస్తున్నట్లు కనిపిస్తోంది. తమ ప్రాభవాన్ని చాటుకోవడానికి ఇక దూకుడుగా వ్యవహరించాలని వారు భావిస్తున్నారనే అనుమానాలు తాజా పరిణామాలతో వ్యక్తమవుతున్నాయి. కాఫీ తోటలను వదిలిపోవాల్సిందిగా వారు చేసిన హెచ్చరికలు ఇప్పుడు మన్యంలో కలకలం రేపుతున్నాయి. కాఫీ తోటలు కేవలం ఓ సాకు మాత్రమేనని దీని వెనక మావోలు వ్యూహం వేరుగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

కాఫీ తోటలు, క్యారీలు సాకుగా...
రెండు రోజుల క్రితం విశాఖ ఏజెన్సీలో కలకలం రేగింది.  జీకే వీధి మండలం పెదవలస గ్రామంలో  రెండు రోజుల క్రితం  మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. మన్యం సంపద కాజేయడానికి పోలీసులు ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో  అరాచకం సష్టిస్తున్నారని వాటిలో రాశారు.ఏపీఎప్డీసీ  అధికారులు కాఫీ తోటలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సపర్ల, చాపరాతిపాలెం, లంకపాకలు, బోనంగిపల్లి, సిరాబల, రంపుల,పెదవలస, కొమ్మంగి, వంగశార, చాపరాతిపాలెం ఎర్రమట్టిక్వారీని మూసివేయాలని లేదంటే క్వారీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న గడుతూరి బాలయ్యపడాల్, జి.శంకర్, జి.మురళి, కె.బాలరాజు, పి.దేముడులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు, కరపత్రాల్లో తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. 

ఉనికి కోసమేనా...
అయితే ఇదంతా అవాస్తవమని, అక్కడ అలాంటివేవీ లేవని కొందరు కొట్టిపడేశారు. కానీ అధికారులు మాత్రం ఇదంతా వాస్తమమేనంటున్నారు. అయితే ఇక్కడ మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది.ఇటీవల గాలికొండ ఏరియా కమిటీ ముఖ్య నేతలను కోల్పోయి బలహీన పడింది. అలాంటి కమిటీ ఇంత దూకుడుగా ఎందుకు హెచ్చరికలు చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. వెనకబడింది కాబట్టే ఉనికి చాటుకోవడానికి ఈ ప్రయత్నం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మావోయిస్టుల నోట మళ్లీ ప్రజాకోర్డు అనే మాట రావడం మాత్రం పోలీసులను, గిరిజనులను కలవరపాటుకు గురిచేస్తోంది. 

కలవరపెడుతున్న చేదు జ్ఞాపకాలు
ఏడాదిన్నర క్రితం బలపం పంచాయతీలో జరిగిన ఘటనను వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో ఓ గిరిజనుడిని చంపి మరొకరిని ప్రజాకోర్టులో హతమార్చేందుకు ప్రయత్నించారు. అనూహ్యంగా వారి ప్రయత్నాన్ని గిరిజనులు అడ్డుకున్నారు. అంతేకాకుండా మావోలపై ఎదురు దాడిచేసి చంపేశారు. ఈ దుర్ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ దాడికి పాల్పడిన వారిని ప్రజాకోర్టులో హతమారుస్తామని మావోలు ప్రతిజ్ఞ కూడా చేశారు. కానీ తర్వాత వారి ప్రతిజ్ఞ నెరవేరే పరిస్థితులు మన్యంలో కనిపించలేదు. కూంబింగ్‌ పెరగడం, వరుసగా ముఖ్య నేతలను కోల్పోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రజా కోర్టును తెరపైకి తేవడంతో మున్నుందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
 
మరిన్ని వార్తలు