ఫలించని పచ్చనేత వ్యూహం

23 Aug, 2016 23:59 IST|Sakshi
ఫలించని పచ్చనేత వ్యూహం

ప్రొద్దుటూరు టౌన్‌:

ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరం రోడ్డులో ఉన్న ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు మంగళవారం మున్సిపల్‌ సర్వేయర్‌ వెంకటేశ్వర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారి శివగురుమూర్తి, ఆర్‌అండ్‌బీ డీఈ సుబ్బరాయుడులు వచ్చి కొలతలు వేసి గతంలో ఇచ్చిన ఆకుపచ్చరంగు మార్కింగ్‌ను నీలి రంగుతో మార్చారు. సాక్షి దినపత్రికలో ఈనెల 22వ తేదీన ‘ఆయన శాసించారు.. అధికారులు పాటించారు!’ అన్న కథనంతోపాటు డివైడర్‌ మార్పుపై పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అధికార పార్టీ నేత ప్రమేయంతో రోడ్డు వెడల్పు పనుల్లో రంగులు మార్చిన విషయంపై అధికారుల్లో కదలిక వచ్చింది. కొలతలు వేస్తున్న అధికారుల వద్దకు 3వ వార్డు కౌన్సిలర్‌ రామాంజనేయరెడ్డి, ఆ ప్రాంత ప్రజలు వచ్చి రంగు మార్చి మార్కింగ్‌ వేయడం సబబేనా అని ప్రశ్నించారు. తాను ఆరోజే ఆర్‌అండ్‌బీ డీఈతో స్పష్టంగా చెప్పానని, మార్కింగ్‌ ఇచ్చినంత వరకు ఆర్‌అండ్‌బీ స్థలమేనని వివరించానని సర్వేయర్‌ చెప్పారు. ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద మార్కింగ్‌ వరకు కొలత వేశారు. అక్కడికి 78 అడుగులు రావడంతో ఆకుపచ్చరంగుతో వేసిన మార్కింగ్‌ను నీలిరంగుతో మార్పు చేశారు. మరి కొన్ని ప్రాంతాల్లో కొలతలు వేసి నీలి రంగుతో మార్కింగ్‌ ఇచ్చారు. దీంతో డివైడర్‌ మొదట నిర్మించినదే సరైనది అయింది.
అడ్డుకున్న భవన యజమాని..
ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌వద్ద మార్కింగ్‌ ఇచ్చిన స్థలం వరకు జేసీబీతో తొలగింపు చర్యలు చేపట్టడంతో భవన యజమాని నాగిరెడ్డి అక్కడికి వచ్చి రంగు మార్చిన వెంటనే తొలగించాలా అని  పనులు అడ్డుకున్నారు. తాను జాయింట్‌ సర్వే చేయించి, అప్పుడు తొలగిస్తానని చెప్పడంతో కౌన్సిలర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
తొలగించాల్సిందే: ఎస్‌ఐ    
ఇంతలో అక్కడికి వచ్చిన ఎస్‌ఐ మహేష్‌ అర్‌అండ్‌బీ డీఈ, సర్వేయర్‌తో మాట్లాడారు. ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రహరీ∙తొలగించాల్సిందేనని వారు చెప్పారు. భవన యజమానికి కూడా ఎస్‌ఐ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను వినిపించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తొలగిస్తారు, స్థలం మీది అయితే వారిపై కోర్టులో కేసు వేసుకోవాలని చెప్పారు.    కౌన్సిలర్‌తోపాటు అక్కడి ప్రజలు మార్కింగ్‌ ఇచ్చిన ప్రాంతం వరకు తొలగించాల్సిందేనని పట్టుబట్టడంతో ముందు వైపు ఉన్న బండచప్పటను జేసీబీతో ఎస్‌ఐ ఆధ్వర్యంలో డీఈ తొలగించారు. విషయాన్ని తెలుసుకున్న మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ కూడా అక్కడికి వచ్చి విషయంపై వాకబు చేశారు.
 

మరిన్ని వార్తలు