కొన్నది లేదు.. అమ్మిందీ లేదు..!

20 Dec, 2016 23:24 IST|Sakshi
కొన్నది లేదు.. అమ్మిందీ లేదు..!
  • ఆదెమ్మదిబ్బ స్థలంలో భూ బకాసురుల లీల!
  • రూ.100 కోట్ల స్థలం కబ్జా చేసినా పట్టించుకోని వైనం
  • పత్రాలు చూపించకపోయినా అధికారుల ప్రేక్షకపాత్ర
  •  
    రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున రూ.100 కోట్ల స్థలం యథేచ్ఛగా ఆక్రమించారు భూ బకాసురులు. నగదు ఇచ్చి పేదల ఇళ్లు తొలగిస్తున్నారు. ఇదేమిటని అడిగిన అధికారులకు, నాయకులకు ‘నేను ఈ స్థలం కొన్నాను’ అని చెబుతున్నారు. ఎప్పుడు కొన్నారు? ఎంత స్థలం కొన్నారు? ఆ డాక్యుమెంట్లు చూపించాలని అధికారులు, వివిధ పార్టీల ద్వితియ శ్రేణి నేతలు అడిగితే.. ‘సాయంత్రం తెస్తాను.. రేపు తెచ్చి చూపిస్తా’నంటూ స్థలం కొనట్టు చెబుతున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు చెబుతున్నారు. దాంతో అధికారులు, పార్టీల నేతలు వెళ్లిపోతున్నారు. 50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, స్థలం కొనుగోలు చేసి ఉంటే ఈ పక్కకు రాబోమని నేతలు అంటున్నారు. ఇదీ ఇప్పటి వరకు జరిగిన రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మ దిబ్బ స్థలం వ్యవహారం.
    – సాక్షి, రాజమహేంద్రవరం
     
     
    డాక్యుమెంట్లు ఏవీ? 
    నగరంలోని 36, 38 డివిజన్ల మధ్య ఉన్న ఆదెమ్మ దిబ్బ స్థలంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న 110 మంది పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. 13వ తేదీన అర్బ¯ŒS తహసీల్దార్‌ కె.పోసయ్య తన సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గుడిసెలు తొలగింపజేస్తున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. తాను 4 వేల గజాలు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని ఈశ్వరుడు తహసీల్దార్‌కు చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని తహసీల్దార్‌ కోరగా, ఈశ్వరుడు ఇక్కడ లేవని చెప్పారు. అయితే సాయంత్రం కార్యాలయానికి తీసుకువచ్చి చూపించాలని తహసీల్దార్‌ ఆదేశించారు. ఇందుకు సమ్మతించిన ఈశ్వరుడు ఆ రోజు సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లలేదు. సరే మరుసటి రోజు తెస్తారని ఎదురుచూసిన తహసీల్దార్‌కు సమయం వృథా అయ్యిందే తప్ప డాక్యుమెంట్లు రాలేదు. ఒకటి కాదు, రెండు కాదు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ స్థలం కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు తహసీల్దార్‌కు చేరలేదు.
    యథేచ్ఛగా ఇళ్ల తొలగింపు
    డాక్యుమెంట్లు చూపిస్తానని చెప్పడంతో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు వెళ్లిపోయారు. డాక్యుమెంట్లు చూపించకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న పేదల గుడిసెలు, రేకుల షెడ్లను ఆక్రమణదారులు యథేచ్ఛగా తొలగిస్తున్నారు. పేదలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారు. ఖాళీ చేయబోమని చెబుతున్న వారి ఇళ్లను కూడా కలిపి చుట్టూ ముళ్ల కంచె వేశారు. రాకపోకలకు వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సొంత వాంబే ఇళ్లు ఉన్నవారు చెప్పిందే తడవుగా ఇచ్చింది తీసుకుని ఖాళీ చేశారు. ఇళ్లు లేని పేదలు వారు ఖాళీ చేశారు కదా, పెద్దలతో వివాదం ఎందుకని వెళ్లిపోయారు. ఇక అక్కడ 10 రేకుల షెడ్లు ఉన్నాయి. అవి పేద బ్రాహ్మణలకు చెందినవి. ఖాళీ చేయాలని వారికి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఓపక్క ఇళ్లు తొలగిస్తుండడంతో, 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని పేరు చెప్పడానికి భయపడుతున్న బ్రాహ్మణ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
     
    పార్టీల నేతలకూ టోకరా..
    ఎన్నో ఏళ్ల నుంచి ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారని తెలుసుకున్న సీపీఎం నేతలు ఈ నెల 13న, బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, గరిమెళ్ల చిట్టిబాబు తదితరులు ఈ నెల 15న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మురుసటి రోజు నగరపాలక సంస్థ వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మసా రామజోగి, జిల్లా కార్యవర్గ సభ్యుడు లంక సత్యనారాయణ తదితరులు స్థలాన్ని పరిశీలించి, పేదలు, పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. అప్పుడు కూడా ఈశ్వరుడు తాను ఈ స్థలం కొన్నానంటూ వారికి చెప్పారు. ఆ డాక్యుమెంట్లు చూపించాలని అడగ్గా, అధికారులకు చెప్పినట్టే సాయంత్రం తెచ్చి చూపిస్తాననడంతో నేతలు వెనుదిరిగారు. అయితే ఇక్కడకు కూడా అధికారులతో పాటు నేతలకూడా స్థలం కొన్నాననంన్న వ్యక్తి టోకరా వేశారు. డాక్యుమెంట్లు చూపించకపోగా, నేతలు ఫో¯ŒS చేసినా తీయడం మానేశారు. ఐదు రోజులవుతున్నా ఈశ్వరుడు డాక్యుమెంట్లు చూపించకపోవడం గమనార్హం.
    ప్రశ్నలు అనేకం.. సమాధానాలు?
    స్థలం కొన్నానని చెబుతూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారు. డాక్యుమెంట్లు ఇప్పటి వరకూ చూపించకున్నా.. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఎందుకు మిన్నుకుండిపోయారు? ఆ స్థల యజమానులు ఎవరు? ఎన్నో ఏళ్లుగా పేదలుంటున్నా వారిని ఎందుకు ఖాళీ చేయించలేదు? ఇన్ని రోజులు అమ్మని స్థలాన్ని ఇప్పడెందుకు విక్రయించారు? అసలు ఎవరికి అమ్మారు? సర్వే నంబర్‌ ఎంత? ఎంత స్థలం కొన్నారు? ఏ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేష¯ŒS జరిగింది? సాక్షులు ఎవరు? పెద్దనోట్ల రద్దు, నగదు విత్‌డ్రాపై ఆంక్షలున్న సమయంలో అంత డబ్బు కొనుగోలుదారులకు ఎక్కడ నుంచి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం నగర ప్రజలను తొలిచేస్తున్నాయి.
     
మరిన్ని వార్తలు