అదును చూసి దోచేస్తున్నారు

20 Aug, 2016 02:29 IST|Sakshi
భీమడోలు/ ఏలూరు అర్బన్‌/పెంటపాడు : దొంగలు చెలరేగిపోతున్నారు. అదును చూసి ఉన్నదంతా దోచుకుపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా తెగబడుతున్నారు. గురువారం రాత్రి జిల్లాలో భీమడోలు మండలం పూళ్ల గ్రామం, ఏలూరు బీడీ కాలనీలో చోరీలు జరగ్గా, శుక్రవారం పట్టపగలే పెంటపాడులో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.
పూళ్లలో తాళాలు పగులకొట్టి..
భీమడోలు: భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని ఆరు కాసుల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదును ఆపహరించుకుపోయారు. భీమడోలు హెడ్‌కానిస్టేబుల్‌ షేక్‌ అమీర్‌ కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పూళ్ల గ్రామానికి చెందిన యిర్రింకి సీతారామ్‌ కుటుంబసభ్యులు వారి బంధువుల ఇంట్లో వివాహానికి గురువారం రాత్రి తాడేపల్లిగూడెం వెళ్లారు. శుక్రవారం ఉదయం 5 గంట లకు తిరిగి ఇంటికి రాగా తలుపు తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి వస్తువులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. రెండు ఉంగరాలు, చెవి దిద్దులు, జత మ్యాటీలు జత తదితర బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదు చోరీ జరిగినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
పెంటపాడులో పట్టపగలే..
పెంటపాడు : పెంటపాడులో పట్టపగలే చోరీ జరిగింది. రూ.35 వేల నగదు, బంగారు, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. పెంటపాడు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. పెంటపాడు వెలంపేటలోని కర్రివారివీధిలో ఆకుల రమాదేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త తాతారావు సైకిల్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే వీరు ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపు పగులకొట్టి ఉంది. బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సుమారు రెండు కాసుల విలువైన బంగారు ఆభరణాలు, వెండి పట్టాలు, కొంత నగదు చోరీ జరిగినట్టు పోలీసులకు సమాచారం అందించారు. హెచ్‌సీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
ఏలూరులో ఏడు కాసులు, నగదు
ఏలూరు అర్బన్‌: తాళాలు పగులగొట్టి ఇంట్లో ప్రవేశించిన దొంగలు బంగారు ఆభరణాలు అపహరించుకుపోవడంతో బాధితుని ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం కె.కన్నాపురంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బత్తుల రాజు తల్లి వెంకటరమణతో కలిసి ఏలూరుS బీడీ కాలనీలో నివాసముంటున్నారు. రాజు తన తల్లితో కలిసి ఈ నెల 13న హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటం గమనించిన పొరుగింటి వారు రాజుకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఇక్కడకు చేరుకున్న రాజు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని ఏడు కాసుల బంగారు నగలు, నగదు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మరిన్ని వార్తలు