విదేశీ భాషల అభ్యసనపై ఆర్డీటీతో ఒప్పందం

9 Aug, 2017 22:56 IST|Sakshi
విదేశీ భాషల అభ్యసనపై ఆర్డీటీతో ఒప్పందం

బుక్కరాయసముద్రం:

నూతన సాంకేతికతను అలవర్చుకున్నప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ ఉపకులపతి డాక్టర్‌ కె.రాజగోపాల్‌ అన్నారు. శాస్త్ర సాంకేతిక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రంగంలో నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. విదేశీ భాషల అభ్యసనపై ఆర్డీటీ సంస్థతో వర్సిటీ యాజమాన్యం ఒప్పందం కుదుర్చకుంది. ఈ సందర్భంగా స్థానిక సిద్ధరాంపురం రోడ్డు సమీపంలో ఉన్న ఆర్డీటీ పాఠశాలలో విదేశీ భాషల అభ్యసనపై తరగతులను బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు.

 

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వంద యూనివర్సీటీల జాబితాలో ఎస్కేయూకు చోటు దక్కిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి వర్సిటీ పలు చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే విదేశీ భాషల అభ్యసనకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు.

ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశీ భాషలపై 2012 నుంచి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికి వెయ్యి మందికి పైగా అభ్యర్థులు విదేశీ భాషపై పట్టు సాధించి, దేశ, విదేశాల్లోని పలు కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్డీటీ మంచి భవిష్యత్తు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్పానీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ తదితర భాషలతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు ఆర్డీటీ సమకూరుస్తుందని అన్నారు. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎస్కేయూ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ డైరెక్టర్లు చంద్రశేఖర్‌ నాయుడు, దశరథరాముడు, నిర్మల్‌ కుమార్, రీజనల్‌ డైరెక్టర్లు నారాయణరెడ్డి, మహబూబీ, ప్రమీల కుమారి, వన్నూరప్ప ఏటీఎల్‌ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు