అంగన్‌వాడీ.. అంతా ఖాళీ

12 Apr, 2017 23:46 IST|Sakshi
అంగన్‌వాడీ.. అంతా ఖాళీ

– ఐసీడీఎస్‌లో భర్తీకాని పోస్టులు
– పథకాల అమలులో కొరవడిన పర్యవేక్షణ
– క్షేత్రస్థాయిలో అక్రమాలకు తావిస్తున్న వైనం


స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీల కొరత పట్టిపీడిస్తోంది. అంగన్‌వాడీల్లో కీలక బాధ్యతలు చూసే హెల్పర్‌ పోస్టులు 271 ఖాళీగా ఉండడంతో కేంద్రాల్లో చిన్నారుల ఆలనా, పాలనా చూసే వారు కరువ్యయారు. మరోవైపు పర్యవేక్షణ చేసే అధికారులు లేకపోవడం అక్రమాలకు తావిస్తోంది. ఇదే సమయంలో అంగన్‌ వాడీల్లో అమలు కావాల్సిన పథకాలు పడకేస్తున్నాయి.

అనంతపురం టౌన్‌ : జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులుండగా, వీటి పరిధిలో 5,126 అంగన్‌ వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 4,286 మెయిన్‌ సెంటర్లు , 840 మినీ కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరేళ్లలోపు చిన్నారులు 3,02,498 మంది చిన్నారులు, 74 వేల మందికి పైగా గర్భిణులు, బాలింతలు ఉన్నారు. ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు అనుబంధ పౌష్టికాహారం, పిల్లలను పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో పౌష్టికాహారంతో పాటు విద్యపై ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏటా వీటి నిర్వహణకు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం ఆశించినంగా ఉండడం లేదు. జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సంబంధించి 20 పోస్టులు, హెల్పర్లకు సంబంధించి 271, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సూపర్‌‘విజన్‌’ ఏదీ?
ఐసీడీఎస్‌లో పీడీ, ఏపీడీ, సీడీపీఓలు, ఏసీడీపీఓలు, సూపర్‌వైజర్లు కీలకంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు వీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నా, పరిస్థితిని చక్కదిద్దాలి. కానీ జిల్లాలో మాత్రం సూపర్‌వైజర్‌ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఇతర ప్రాజెక్టుల్లోని వారికే ఇన్‌చార్జ్‌లుగా ఇవ్వడంతో వారు సరిగా పర్యవేక్షించలేకపోతున్నారు. కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా కొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్న పరిస్థితి. 17 ప్రాజెక్టుల్లోనూ గ్రేడ్‌–1 సూపర్‌వైజర్‌ పోస్టులు 56, గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులు 50 ఖాళీగా ఉన్నాయి.

పథకాల అమలులో అక్రమాలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజు 200 మి.లీ పాలు, ఉడకబెట్టిన ఒక గుడ్డు, రోజు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె, 50 గ్రాముల కూరగాయాలతో కలిపి ఒక పూట భోజనం కేంద్రం వద్దే అందిస్తారు. 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు రోజుకు ఒక గుడ్డు, ఒక నెలలో 16 గుడ్లు ఇంటికి అందిస్తారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు రోజుకు ఒక కోడిగుడ్డు, 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనె, 25 గ్రాముల కూరగాయలతో కూడిన భోజనం పెడతారు. ఇవన్నీ చాలా ప్రాంతాల్లో సక్రమంగా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సిబ్బంది కొరత నేపథ్యంలో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారు పర్యవేక్షించడం లేదు. కొందరు ఇదే అదునుగా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పోస్టుల భర్తీ మా చేతుల్లో లేదు : జుబేదాబేగం, ఐసీడీఎస్‌ పీడీ
కొన్ని ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో వీటిని త్వరలోనే భర్తీ చేస్తాం. సూపర్‌వైజర్‌ పోస్టులను ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుంది. అది మా చేతుల్లో లేదు. ఇక్కడి ఖాళీల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.  

ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు :


 

మరిన్ని వార్తలు