మాఫీ.. టోపీ

22 Jun, 2016 03:10 IST|Sakshi
మాఫీ.. టోపీ

రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం
గద్దెనెక్కాక మొక్కుబడి మాఫీతో వంచన
జిల్లాలో రుణాలు తీసుకున్న రైతులు 7,06,000 మంది
మాఫీ వర్తించినవారు 4.70 లక్షలు తీసుకున్న రుణం రూ.4,966 కోట్లు
ప్రభుత్వం ఇచ్చిన మొత్తం రూ.593.6 కోట్లు
మాఫీ డబ్బులు వడ్డీలకూ సరిపోని వైనం
ఇదేమి మాఫీ బాబూ అంటూ అన్నదాతల ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల వేళ రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. గద్దెనెక్కాక అరకొర రుణాలను మాత్రమే మాఫీ చేసి, నమ్మి ఓట్లేసిన అన్నదాతల్ని వంచించారు. రుణాలు తీసుకున్న వారిలో 50 శాతం రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేయకపోయారు. మాఫీ డబ్బు రైతుల బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోలేదు. మొదటి విడత మొక్కుబడిగా నిధులు విదిల్చి, ఇప్పుడు రె ండో దఫా మాఫీ అంటూ మాయ చేస్తున్న చంద్రబాబు సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 జిల్లాలో 31-12-2013 నాటికి 7,06,000 మంది  రైతులు వివిధబ్యాంకులకు 456 బ్రాంచిలలో రూ. 4,966 కోట్లు రుణాలు తీసుకున్నారు. వరుస కరువులతో రైతులు బ్యాంకు రుణాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మొదటి ఫేజ్‌లో 3,31,210 ఖాతాలకు రూ.1420 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా రూ.376 కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండవ ఫేజ్‌లో 1,28,000 ఖాతాలకు రూ. 517 కోట్లకు గాను రూ.193.06 కోట్లు ఇచ్చారు. మూడవ ఫేజ్‌లో 14,808 ఖాతాల పరిధిలో రూ.74.58 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.23.02 కోట్లిచ్చారు. మొత్తం మూడు ఫేజ్‌లు కలిపి 4,74,034 ఖాతాల పరిధిలో రూ. 2011.92 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం రూ.593.6 కోట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఇంకా రూ. 1418.32 కోట్లు ఇవ్వాల్సివుంది. ఈ లెక్కన 25 శాతం మొత్తాన్ని కూడా రైతులకు చెల్లించలేదు. మిగిలిన రూ.1418.32 కోట్లకు సంబందించి 10 శాతం వడ్డీ వేసుకుంటే మరో రూ.140 కోట్లు ఇవ్వాలి. ఈ లెక్కన ఇంకా రూ.1550 కోట్లు పైనే ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి వుంది. కానీ ఇప్పట్లో సర్కారు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.

మాఫీకి ఆర్థిక ఇబ్బందుల సాకు..
మిగిలిన మొత్తంలో రెండో విడతగా రూ. 350 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటూ ప్రకటించడం చూస్తే రాబోయే ఐదేళ్లకు కూడా బాబు చెప్పే రుణమాఫీ అమలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లెక్కన మాఫీ అయిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించే లోపు బ్యాంకు అప్పుకు వడ్డీకి కూడా సరిపోదని, రైతులు బ్యాంకుకు మళ్లీ అప్పు పడాల్సి ఉంటుందని సాక్షాత్తు బ్యాంకు అధికారులే పేర్కొనడం గమనార్హం. ముఖ్యమంత్రి పర్యటనలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు సాకుగా రైతు రుణమాఫీ డబ్బులు ఎగనామం పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు