వెబ్‌ల్యాండ్‌కూ డబ్బు జబ్బు

20 Apr, 2017 02:59 IST|Sakshi
వెబ్‌ల్యాండ్‌కూ డబ్బు జబ్బు

ముడుపులివ్వకుంటే ముప్పుతిప్పలు
కుంటిసాకులతో అర్జీల తిరస్కరణ
వచ్చిన దరఖాస్తుల్లో 40 శాతానికిపైగా రిజెక్ట్‌
ఈ పట్టాదార్‌ పాస్‌పుస్తకాల జారీలో జాప్యం
క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేకాధికారులు


విశాఖపట్నం : ఈ–పట్టాదార్‌ పాస్‌పుస్తకాల జారీ, మ్యుటేషన్‌లలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ అర్జీదారులను రకరకాల కొర్రీలతో  ముప్పుతిప్పలు పెడుతున్నారు. అందిన దరఖాస్తుల్లో 40 శాతానికి పైగా తిరస్కరణకు గురికావడంతో.. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలని రెవెన్యూ ఉన్నతాధికారవర్గాలు నిర్ణయిం చాయి. అందుకోసం ప్రత్యేకాధికారులను నియమించారు. ఆన్‌లైన్‌ వ్యవస్థ వచ్చినా..: గతంలో మాన్యువల్‌గా రికార్డులు నిర్వహించే సమయంలో కొత్త పాస్‌పుస్తకాల జారీ, ఉన్న వాటిలో మార్పులు, చేర్పులు (మ్యుటేషన్‌) చేయాలంటే వీఆర్వో నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు పెద్ద తతంగమే నడిచేది. ప్రతి దశలోనూ బల్లకింద చేయితడపనిదే ఫైలు కదిలేది కాదు.

రికార్డులన్నీ పక్కాగా ఉన్నా సొమ్ములివ్వకపోతే కొర్రీలతో పెండింగులో పడేసేవారు. టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్‌ల్యాండ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో ఈ–పాస్‌పుస్తకాల జారీకి శ్రీకారం చుట్టారు. అయితే వెబ్‌ల్యాండ్‌లో జరిగిన అవకతవకలపై ఏకంగా రెండు లక్షలకు పైగా ఫిర్యాదులు రాగా.. వాటి పరిష్కారం కోసం వందలాది మంది అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇక మ్యూటేషన్, ఈ–పాస్‌పుస్తకాల జారీకి ఇప్పటి వరకు 1,29,374 అర్జీలందగా.. వాటిలో 72,748 అర్జీలను మాత్రమే అప్రూవ్‌ చేశారు. మిగిలిన వాటిలో 52,492 అర్జీలను వివిధ కారణాలతో క్షేత్రస్థాయి అధికారులు తిరస్కరించారు. వాటికి సరైన కారణాలు చూపకపోవడంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

సీసీఎల్‌ఏ సీరియస్‌ : ఇంత భారీ సంఖ్యలో అర్జీలు తిరస్కరణకు గురవడాన్ని సీసీఎల్‌ఎ సీరియస్‌గా తీసుకుంది. సీసీఎల్‌ఎ కమిషనర్‌ ఆదేశాల మేరకు తిరస్కరణకు గురైన అర్జీలతో పాటు అప్రూవ్‌ చేసిన వాటికి కూడా సాధ్యమైనంత త్వరగా ఈ –పట్టాదార్‌ పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రత్యేకాధికారులను జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నియమించారు. మూడేసి మండలాలకొకరు చొప్పున స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులను నియమించారు. ఈ నెలాఖరులోగా పరిశీ లన జరిపి రెవెన్యూ అధికారులతో పాటు తిరస్కరణకు గురైన అర్జీదారులతో కూడా మాట్లాడి క్షేత్ర స్థాయిలో ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో జిల్లా కలెక్టర్‌కు ఈ ప్రత్యేకాధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు