అరణ్య రోదన

3 Feb, 2017 02:19 IST|Sakshi
అరణ్య రోదన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అరణ్యం రోదిస్తోంది. పెదవేగి మండల పరిధిలో ఓ మాఫియా చెలరేగిపోతుంటే.. అటవీ శాఖ యంత్రాంగం తనకేమీ తెలియనట్టు నిద్రనటిస్తోంది. మూడు రోజులుగా అటవీ ప్రాంతంలోని వెదురు, యూకలిప్టస్‌ చెట్లను అక్రమార్కులు తెగనరుకుతున్నారు. హైవేను తలపించే రోడ్డుతోపాటు వెదురు పొదల మధ్యనుంచి అంతర్గత రహదారులూ నిర్మించారు. అటవీ సంపదను లూటీ చేస్తూ వాహనాలపై యథేచ్ఛగా తరలిస్తున్నారు. మూడు రోజులుగా ఈ తంతు సాగుతున్నా అటవీ శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను వారి దృష్టికి తీసుకెళితే.. ‘ఔనా.. అలాగా.. మాకెలాంటి సమాచారం లేదు’ అంటూ దాటవేస్తున్నారు.
 
పగలు నరికివేత.. రాత్రి తరలింపు
పెదవేగి మండలం న్యాయంపల్లి, కూచింపూడి గ్రామాల పరిధిలోని 6,500 ఎకరాల్లో అడవి విస్తరించి ఉంది. అందులో 300 ఎకరాల్లో ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వెదురు ప్లాంటేషన్‌ వేశారు. ప్రస్తుతం ఈ ప్లాంటేషన్‌తోపాటు అడవిలో ఉన్న యూకలిప్టస్‌ చెట్లను సైతం యథేచ్ఛగా నరికేస్తున్నారు. పగటి వేళ చెట్లను నరికి వాహనాలపై రహదారిపైకి చేరుస్తున్నారు. రాత్రివేళ వీటిని లారీల్లో తరలించుకుపోతున్నారు. ఈ సమాచారం తెలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన ‘సాక్షి’ బృందానికి హైవేను తలపిస్తూ అటవీ ప్రాంతంలో నిర్మించిన రహదారి కనిపించింది. చట్ట ప్రకారం అటవీ భూముల్లో రోడ్డు వేయకూడదు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొద్దిపాటి రెవెన్యూ భూమిని అడ్డం పెట్టుకుని అటవీ భూమిని కలిపేసి పెద్ద రోడ్డు నిర్మించారు. నరికిన వెదురు బొంగులు, యూకలిప్టస్‌ కలపను ట్రాక్టర్లపై ఈ రహదారిపైకి చేరుస్తున్నారు. అక్కడి నుంచి భారీ వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు. అడవిలోకి వెళ్లకుండా నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా స్థానిక నాయకుల సాయంతో రిజర్వు ఫారెస్ట్‌ సంపదను తరలించుకుపోతున్నారు. వెదురు, యూకలిప్టస్‌తోపాటు అటవీ భూముల్లోని మట్టి, కొండ రాళ్లను సైతం ఎత్తుకుపోతున్నారు. 
 
యంత్రాంగం ఎక్కడ
అటవీ భూములతోపాటు అక్కడి సంపదనూ కాపాడాల్సిన అటవీ శాఖ గార్డ్, ఫీల్డ్‌ అసిస్టెంట్, సూపర్‌వైజర్, డీఆర్వో తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మూడు రోజులుగా ఇక్కడ సాగుతున్న అక్రమ వ్యవహారంపై స్థానికులు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించలేదు. ఒకవేళ వెదురు గడలు నరికేందుకు అనుమతులు ఇచ్చి ఉంటే.. ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎవరికి హక్కులు కల్పించారన్న వివరాలు ఇవ్వాలని కోరినా వారు స్పందించలేదు. 
 
అవినీతికి రోడ్డేశారు
అటవీ భూముల్లో నిర్మించిన రహదారి కూచింపూడి, కొండరావిపాలెం, రామచంద్రాపురం లింక్‌రోడ్డు అని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అయితే, దానికి అనుసంధానంగా మరో రోడ్డు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అటవీ భూమి కావడం, స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కిలోమీటర్‌ అనంతరం రోడ్డు నిర్మాణం ఆగిపోయినట్టు సమాచారం. 
 
అడవిని కాపాడండి
అడవిని, అటవీ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది. దీనిపై అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ స్పందించలేదు. కేంద్ర అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– ఎల్‌.నాగబాబు, కన్వీనర్, లోక్‌ జనశక్తి పార్టీ జిల్లా శాఖ 
 
మా దృష్టికి రాలేదు
కూచింపూడిలో అడవిని నరికివేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. అక్కడి భూముల్ని ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు లీజుకు ఇచ్చి ఉండొచ్చు. పూర్తి వివరాలు తెలియదు. విచారణ జరిపిస్తాం.
– ఎం.నాగేశ్వరరావు, డీఎఫ్‌వో
 
మరిన్ని వార్తలు