రచ్చ..రచ్చ

24 Jul, 2017 01:38 IST|Sakshi
రచ్చ..రచ్చ

ఇఫ్కో భూముల అక్రమాలపై వాగ్వాదం
పసుపు అవినీతిపై అరుపులే అరుపులు
జెడ్పీ జనరల్‌ బాడీలో వాడీవేడి చర్చ


ఇవిగో అధికారపార్టీ అక్రమాలు.. సాక్ష్యాలు ఇవిగో.. అవినీతి అక్రమాలను రుజువుచేస్తాం అంటూ ప్రతిపక్ష నాయకులు.. రండి తేల్చుకుందాం అంటూ అధికారపార్టీ నాయకులు.. ప్రతి అంశంపై వాగ్వాదం.. ఇలా జెడ్పీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు నడుమ ఆద్యంతం వాడీవేడి చర్చ సాగింది.

నెల్లూరు(క్రైమ్‌): జెడ్పీ సమావేశమందిరంలో జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇఫ్కో కిసాన్‌సెజ్‌ భూముల అక్రమాలపై, అనుమతులు లేకుండా విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయడంపై కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్న కాలుష్యకారకాలైన పరిశ్రమలను అడ్డుకోవాలన్నారు. కిసాన్‌సెజ్‌కు సంబంధించి మొత్తం 3,370ఎకరాలు సేకరించిన ఇఫ్కో యాజమాన్యం కేవలం 242 ఎకరాలకే పరిహారం
చెల్లించిందన్నారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌కు సంబంధించి  రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని పట్టుబట్టారు. ఈ విషయమై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అధికారులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు జెడ్పీటీసీ సభ్యుడి ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. ఈ క్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి జోక్యం చేసుకుని కిసాన్‌ సెజ్‌పై ఆరోపణలు చేస్తుంటే అడ్డుకోవడం సబబుకాదన్నారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టిన వారు నిబంధనలు పాటించడం లేదన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదనీ, సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి పనుల చేయడం లేదని పేర్కొన్నారు. పరిశ్రమలకు సంబం«ధించిన సమస్యలపై చర్చించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిం చాలని ఎమ్మెల్యేలు కోరారు. దీంతో కలెక్టర్‌ స్పందిస్తూ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

నీరు–చెట్టు, ఫైబర్‌ చాక్‌డ్యామ్‌ల అవినీతిపై ఆగ్రహావేశాలు
నీరు–చెట్టు వ్యవహారంపై స్వపక్ష, విపక్షలా మధ్య రభస జరిగిం ది. నీరుచెట్టు పేరుతో బూటకపు పనులు  చేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పత్రికల్లో ప్రచురితమైన కథనాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.  తన నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద అవసరమైన చోట చెక్‌డ్యామ్‌లు కట్టమంటే కట్టడం లేదన్నారు. ఫలితంగా నెర్రికాలువ పూడికతీత పనులు రైతులు చందాలువేసుకుని చేసుకుంటున్నారన్నారు. ఎందుకిలా జరుగుతుందని ఆయన అధికారులను నిలదీశారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పందిస్తూ జిల్లాలో వేల పనులు ఒక్కసారిగా జరుగుతున్నాయని అక్కడక్క డా పొరపాట్లు జరిగి ఉంటాయే తప్ప పథకమే తప్పని చెప్పడం సరికాదన్నారు.  

ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న  ఫైబర్‌ చెక్‌డ్యామ్‌లపై ఉదయగిరి ఎంపీపీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు ఎమ్మెల్సీ బీద అభ్యంతరం తెలియజేస్తూ ఫైబర్‌ చెక్‌డ్యామ్‌లు ముఖ్యమంత్రి మోడల్‌గా తీసుకొంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటం సరికాదన్నారు. ఈ దశలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి  ఫైబర్‌డ్యామ్‌ నిర్మాణాలపై పత్రికలు వరుస కథనాలను ప్రచురిస్తున్నాయనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. 
 
పసుపుపై అరుపులే..అరుపులు
అవినీతి కుంభకోణాలతో ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన పసుపు కుంభకోణం జెడ్పీ సమావేశాన్ని అట్టుడికించిం ది. అధికారపార్టీ నాయకులే పథకం ప్రకా రం పొలాలు లేకున్నా ఉన్నట్లు చూపి అవి నీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. జిల్లాలో సుమారు రూ.14 కోట్లమేర పసుపు కుంభకోణం జరిగిందని  దీనిపై నిగ్గుతేల్చాలని జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి డిమాండ్‌ చేశారు.  ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలన్నారు.  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ పసుపు కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారు ఏ పార్టీకి చెందిన వారైనా చర్య తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

రెండు, మూడురోజుల్లో నివేదిక
పసుపు కుంభకోణంను నిగ్గుతేల్చేందుకు ఇదివరకే జేసీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ ముత్యాలరాజు చెప్పారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి వాస్తవాలను వెలికితీస్తామని చెప్పారు. రెండు, మూడురోజుల్లో నివేదిక అందుతుందని అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.

ఫొటోలేదని..
జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు ఇస్తున్న మార్గదర్శి ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను సైతం రచ్చలోకి లాగేందుకు అధికారపార్టీనేతలు ప్రయత్నించారు. జెడ్పీ, కలెక్టర్‌ ఇచ్చిన ఇన్నోవేటివ్‌ నిధులతో ప్రత్యేక మెటీరియల్‌ రూపొందించారు. అయితే దానిపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి ఫొటో లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ప్రతి ఏడాదీ పదోతరగతి స్టడీ మెటిరీయల్‌లో ఎలా ఉందో అలానే ముద్రించామని జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి ఎదురు దాడికి దిగారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జెడ్పీ చైర్మన్‌ ఉచితంగా మార్గదర్శిని పేరిట పుస్తకాలు పంపిణీ చేస్తుంటే ఇంత రాద్ధాంతం ఎందుకని వైఎస్సార్‌సీపీ ఎమ్మల్యేలు కాకాణి, రామిరెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరీష, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. కాగా సభలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాగ్వాదం చేసుకుంటుండగా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు తమకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు తమ స్థానాల్లో నిలుచున్నారు. అవకాశం దొరికినప్పుడు తమ సమస్యలను వివరించేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు