బజారు బేజారు

12 Dec, 2016 14:45 IST|Sakshi
బజారు బేజారు
ధరల మెట్టు దిగిన అపరాలు హాయిగా కొనుక్కెళ్లండని ఆఫర్‌ ఇస్తున్నాయి. ఉల్లి, కూరగాయలు బెట్టు వీడాయి. ‘రండిబాబూ.. రండి. ధరలు తక్కువండీ’ అని బిగ్గరగా పిలుస్తున్నాయి. అయినా.. వాటివైపు జనం కన్నెత్తి చూడటం లేదు. కొనేవారు లేక చేపలు, పీతలు, ఎండు చేపల వంటివి డీలా పడ్డాయి. పెద్దనోట్ల దెబ్బకు మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. జన జాతరను తలపించే సంతలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ వ్యాపారిని కదిపినా నిట్టూర్పులే వినిపిస్తున్నాయి.
తాడేపల్లిగూడెం : కొనుగోలుదారులు రాక జిల్లాలోని అన్ని మార్కెట్లు కళ తప్పాయి. పెద్దనోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత కారణంగా వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జనంతో కిటకిటలాడే సంతలు, రైతు బజార్లు వెలవెలబోతున్నాయి. ఆదివారం సంత, అపరాల మార్కెట్లలో వ్యాపారులు తప్ప కొనేవాళ్లు కనిపించలేదు. ధరలు దిగొచ్చినా చేతిలో తగినన్ని చిల్లర నోట్లు లేక కొనుగోలుదారులు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ధరలు అమాంతం పెరిగిపోతాయని మార్కెట్‌ వర్గాలు భావిం చగా.. కొనేవారు లేక దిగొచ్చాయి. తమ వద్ద ఉన్న సరుకును తక్కువ ధరకే ఇచ్చి కనీసం పెట్టుబడులైనా దక్కించుకుందామనుకుంటే కొనుగోళ్లు పడిపోయాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో అపరాలు, కూరగాయల మార్కెట్లలో రోజుకు రూ.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా.
ప్రధాన వాణిజ్య కేంద్రంలోనూ ఇలా
జిల్లాలో హోల్‌సేల్‌ వ్యాపారానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం మార్కెట్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడి మార్కెట్‌కు ఆదివారం కర్నూలు నుంచి 70 లారీల కొత్త ఉల్లిపాయలు వచ్చాయి. మహారాష్ట్ర నుంచి 4 పాత ఉల్లిపాయల లారీలు వచ్చాయి. అమ్మకాలు లేకపోవడంతో ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోయింది. గడచిన వారం దేశంలోని ఉల్లి మార్కెట్లకు సెలవు ప్రకటించడంతో తెలంగాణ, కృష్ణా జిల్లా వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌కు క్యూ కట్టారు. దాంతో ధరలు కొంతమేర పెరిగాయి. తాజా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈ ఆదివారం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లి అమ్మకాలు 40 శాతం పడిపోయాయి. గత వారం 70 లారీల ఉల్లి అమ్ముడుపోగా, ఈ వారం కేవలం 40 లారీల సరుకు మాత్రమే అమ్ముడైంది. ధరలు వారం రోజుల క్రితంతో పోలిస్తే తగ్గాయి.
అపరాలదీ అదేదారి
అపరాల విషయానికి వస్తే ఇక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఆదివారం కనీస స్థాయిలో అయినా అమ్మకాలు సాగలేదు. పప్పులు పాత సరుకు అయిపోయి.. కొత్తవి తెచ్చుకోవాల్సిన తరుణమిది. కానీ.. వాటిని మార్కెట్లకు తెచ్చుకునే పరిస్థితి లేకుండాపోయింది. రాజమండ్రి నుంచి మసాలా దినుసులు, మధ్యప్రదేశ్‌ నుంచి వెల్లుల్లి, మహారాష్ట్ర నుంచి కంది, ఇతర పప్పులు దిగుమతి చేసుకోవాల్సి ఉండగా.. ఒక్క బస్తా కూడా ఇక్కడి మార్కెట్లకు రాలేదు. అలాగని అపరాల దుకాణాల్లో ఉన్న పాత సరుకులు సైతం అమ్ముడుకావడం లేదు. పోనీ.. రద్దయిన నోట్లు తీసుకుని సరుకులు అమ్ముదామంటే దుకాణాల్లో ఉన్న నిల్వలు పట్టుమని పది రోజులుకైనా సరిపోవు. కొత్త సరుకు తెచ్చుకోలేక, మిగిలివున్న పాత సరుకు అమ్ముకోలేక వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో రోజుకు రూ.1.25 కోట్ల విలువైన అపరాలు అమ్ముడయ్యేవి. ప్రస్తుతం కనీసం రూ.25 లక్షల విలువైన సరుకు కూడా పోవడం లేదు. నూనెల మార్కెట్‌లో అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో దుకాణాల నిర్వహణ ఖర్చులు, బ్యాంక్‌లకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలకు సొమ్మును ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక వ్యాపారులు అవస్థ పడుతున్నారు. 
టోకెన్లు తీసుకునే వారేరి
చిల్లర కొరత తీర్చడానికి పౌర సరఫరాల శాఖ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా పెద్దనోట్లు తీసుకుని కూరగాయలు, అపరాలు కొనుగోలు చేసేందుకు వీలుగా టోకెన్లు ఇస్తోంది. వీటిని తీసుకునేవారు కనబడటం లేదు. కొందరు తీసుకున్నా సరుకులు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కూరగాయలు, అపరాల కౌంటర్లు వెలవెలబోతున్నాయి.
సంతలన్నీ నిర్మానుష్యం
చిన్న నోట్లు లేకపోవడం.. కొత్తగా విడుదల చేసిన రూ.2 వేల నోటుకు సరిపడా చిల్లర నోట్లు వ్యాపారుల వద్ద లేకపోవడం సంతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉల్లిపాయల చిల్లర వర్తకులు వ్యాపారం సాగకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. తాడేపల్లిగూడెం సంతలో ఆదివారం రూ.25 లక్షలకు పైగా వ్యాపారం జరగాల్సి ఉండగా, కనీసం రూ.10 లక్షల వ్యాపారమైనా సాగలేదు. సంతలో దుకాణాలు తెరిచింది మొదలు రాత్రివరకూ ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సి వచ్చిందని కూరగాయల వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే.. ఆదివారం రోజున జోరుగా సాగాల్సిన మాంసాహార విక్రయాలు కనీస స్థాయిలో కూడా జరగలేదు. ఓవైపు కార్తీక మాసం కారణంగా అమ్మకాలు సగానికి పడిపోగా.. పెద్దనోట్ల ప్రభావం వల్ల వాటివైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. ఉప్పు చేపల మార్కెట్‌లో రూ.25 లక్షల మేర అమ్మకాలు జరగాల్సి ఉండగా, కనీసం రూ.లక్ష విలువైన అమ్మకాలు కూడా నమోదు కాలేదు. చేపలు, రొయ్యలు, మాంసం పడిపోయింది. బెల్లం. రవ్వ, చింతపండు, ఎండుమిర్చి వ్యాపారాలపై కూడా పెద్దనోట్ల ప్రభావం భారీగా పడింది. అమ్మకాలు దాదాపుగా 40 శాతం పడిపోయాయి. 
కేజీ పంచదారకు 
రూ.2 వేల నోట ఇస్తున్నారు
పెద్దనోట్ల రద్దు ప్రభావం అపరాల మార్కెట్‌పై తీవ్రంగా ఉంది. కిలో పంచదార కొని రూ.2 వేల నోటు ఇస్తున్నారు. చిల్లర ఇవ్వలేక బేరాలు వదులుకుంటున్నాం. మొహమాటానికి పోయి పాతనోట్లు తీసుకున్నా, వాటిని బ్యాంకులో వేసుకోవడం సమస్య. దుకాణాల నిర్వహణ కష్టంగా మారింది. పైనుంచి సరుకులు రావడం లేదు. నిల్వలు అయిపోతే దుకాణాలు మూసుకోవాల్సిందే.
– ఎం.మోహనరెడ్డి, అపరాల గుత్త వ్యాపారి 
 
 
 
 
 

 

మరిన్ని వార్తలు