చిన్నోళ్లకే కష్టం.. | Sakshi
Sakshi News home page

చిన్నోళ్లకే కష్టం..

Published Mon, Nov 21 2016 12:15 AM

చిన్నోళ్లకే కష్టం.. - Sakshi

కుదేలవుతున్న వ్యవసాయం రంగం
వ్యవసాయ, నిర్మాణ రంగ కూలీలకు దొరకని పని
బ్యాంకుల్లో డబ్బు లేదంటూ బోర్డులు

చెన్నారావుపేట మండలం ఖాధర్‌పేటకు చెందిన ఈయన 30 గుంటల భూమిలో క్యాబేజీ పంట సాగుచేశాడు. పంట చేతికంది మార్కెట్‌కు తీసుకువెళ్దామనుకునే సమయంలోనే పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదల్లో రెండు రోజులు తన వద్ద ఉన్న డబ్బుతో కూలీలను పెట్టి పంట ఏరించాడు. అరుుతే, మార్కెట్‌లో అమ్మేందుకు వెళ్తే కొనుగోలు జరగలేదు. ఎలాగో పంట అమ్ముకుని ఇంటికి చేరాడు. ఆ తర్వాత తోటలో మిగిలిన క్యాబేజీ ఏరించేందుకు కూలీలను పిలుద్దామంటే డబ్బు లేదు. ఓ పక్క పంట ముదిరిపోతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొమురయ్య ఆవేదన చెందుతున్నాడు. పెద్దనోట్లు రద్దు చేసిన కారణంగా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు కొమురయ్య ఉదంతమే ఓ ఉదాహరణ.

నర్సంపేట : పెద్దనోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లో పడేసింది. వ్యవసాయ కూలీల నుంచి ఇరవై ఎకరాల ఆసామి వరకు కష్టాలు పడుతున్నారు. యాసంగి పెట్టుబడికి డబ్బులేక.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేక సాగు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో పండిన పంటలకు గిట్టుబాటు లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అన్నదాత చిల్లర కష్టాలతో చిన్నాచితకా వ్యాపారాలు మూతపడుతున్నారుు. ఇప్పటికే పనులు లేక అల్లాడుతున్న గ్రామీణ ప్రజానీకం నోట్ల రద్దుతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల వంటి పట్టణాల్లో వ్యవసాయ కూలీలు పనుల కోసం రహదారులపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక.. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కొంత మంది కూలీలు నిత్యావసర సరుకుల కోసం కూలి పనికి వెళ్తే వారికి వ్యాపారులు పాత నోట్లనే ఇస్తున్నారు. వీటిని మార్చుకునే క్రమంలో వారి మరిన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తోంది.

తగ్గిన పంట కొనుగోలు...
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో వానాకాలం పంటలను మార్కెట్‌లో అమ్మేందుకు రైతులు ముందుకు  రావడం లేదు. పంట అమ్మితే వ్యాపారులూ పెద్దనోట్లను ఇస్తున్నారని.. వాటిని ఎలా మార్చుకోవాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఆశాజనకంగానే వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయని ఆశ పడుతుంటే తమ ఆనందం ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో అమ్మితే చెక్కులు ఇస్తామని అధికారులు అంటుండగా.. వ్యాపారులకు అమ్మితే వారు కనీసం డబ్బులు ఇవ్వడానికి రెండు నెలలు గడువు అడుగుతున్నారు. దీంతో పంట సరుకును చూస్తూ గడుపుతున్న రైతులు అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఇకనైనా బ్యాంకుల అధికారులు మార్పిడికి వచ్చే ప్రతీ వారికి రూ.2వేల నోట్లు ఇవ్వకుండా సరిపడా చిల్లర నోట్లను అందుబాటులో ఉంచాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement