నవవరునిగా బాలబాలాజీ

4 Jun, 2017 22:09 IST|Sakshi
నవవరునిగా బాలబాలాజీ
-వార్షిక దివ్యతిరుకల్యాణోత్సవాలకు శ్రీకారం
-నేటి రాత్రి 9.02 గంటలకు పరిణయ వేడుక
మామిడికుదురు (పి.గన్నవరం) : భక్తజనమనోరంజకంగా వైనతేయ తీరాన కొలువైన బాలబాలాజీ నవవరుడయ్యాడు. వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూరాగరు సుగంధ వీచికల నడుమ స్వామి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం సాయంత్రం ఆరు గంటల శుభ ముహూర్తాన పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి అర్చక బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బాలబాలాజీతో పాటు ఉభయ దేవేరుల బుగ్గన చుక్క పెట్టి వారిని పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెలుగా తీర్చిదిద్దారు. కల్యాణోత్సవాలు నిరాటంకంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన నిర్వహించారు. తదుపరి పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమం, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు కల్యాణోత్సవాలు కనుల పండుగలా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు.  
నేటి కార్యక్రమాలు
-ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ -ఆరు గంటలకు స్వామి వారికి సహస్రనామార్చన -ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన -ఎనిమిది గంటలకు చతుస్ధానార్చనలు - 10 గంటలకు ధ్వజారోహణ, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద గోష్ఠి -సాయంత్రం 4 గంటలకు  బాల బాలాజీ స్వామి వారి తిరువీధి ఉత్సవం -ఆరు గంటలకు చతుస్థానార్చనలు, నిత్యోపాసన, బలిహరణ -రాత్రి 8 గంటలకు స్వామి వారి రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) -9.02 గంటలకు దివ్య తిరు కల్యాణోత్సవం, తీర్థ ప్రసాద గోష్ఠి
మరిన్ని వార్తలు