మట్టిలో మాణిక్యం

16 Aug, 2016 22:52 IST|Sakshi
సాధించిన పతకాలతో మల్లేశం
  • ఎన్నో షీల్డులు సాధించినా.. ప్రోత్సాహం సున్నా!
  • కూలి చేస్తున్న జాతీయ స్థాయి యోగా క్రీడాకారుడు
  • మెదక్‌ రూరల్‌: క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు గ్రామీణ క్రీడాకారుల పట్ల చిన్నచూపే చూస్తున్నాయి. ఎంతో ప్రతిభ గల క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక అట్టడుగునే ఉండిపోతున్నారు. ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణలేక కూలీనాలి చేసుకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్నారు.

    అలాంటి ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన యోగా క్రీడాకారుడు అబ్రబోయిన మల్లేశం. మెదక్‌ మండలం బూర్గుపల్లి గ్రామానికి అబ్రబోయిన మల్లమ్మ-లింగయ్య దంపతులకు నలుగురు సంతానం. వారిలో చిన్నవాడైన మల్లేశం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి, అక్కడే యోగాపై శిక్షణ పొందాడు. పాఠశాల స్థాయి నుంచే స్కూల్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో పతకాలు సాధించాడు.

    పతకాలు సాధించిన మల్లేశంను చూసి చప్పట్లు కొట్టేవారే కానీ ప్రతిభను ప్రోత్సహించిన వారే లేరు. మరిచిపోయారు. పేదకుటుంబంలో పుట్టిన మల్లేశం అర్థాకలితో అలమటిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. ప్రస్తుతం మెదక్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివిన మల్లేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆరు నెలల క్రితం తండ్రి మరణించగా, అన్నలిద్దరూ బతుకు దెరువుకోసం పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లారు.

    దీంతో మల్లేశం గ్రామంలోని చిన్నపాటి పూరి గుడిసెలో తల్లితోపాటు ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూలీనాలి చేసుకుంటూ తల్లికి తోడుగా ఉంటున్నాడు. రెండుసార్లు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతులు సాధించగా, రాష్ట్రస్థాయి యోగాలో పదిసార్లు పాల్గొనగా 4సార్లు పతకాలు చేజిక్కించుకున్నాడు. 2006లో ఢిల్లీ, 2008లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు, సర్టిఫికెట్లు సాధించాడు.

    ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాను నేర్చుకున్న యోగా ప్రతిభను చూపేందుకు అధికారులను పలుమార్లు వేడుకున్నాడు. దీంతో అతనికి ఐదు నిమిషాలపాటు అవకాశం ఇవ్వడంతో వందలాది మంది జనాలు, ఆర్డీఓస్థాయి అధికారులు, వేలాది మంది విద్యార్థులు మల్లేశం ప్రతిభను చూసి ఎప్పటిలాగే చప్పట్లతో సరిపెట్టారు. తన ప్రతిభను చూసైనా తనను ప్రోత్సాహించాలంటూ మల్లేశం పదే పదే వేడుకుంటున్నాడు.

    ఇంతటి ప్రతిభ గల మల్లేశం పూరిగుడిసెలో కనీసం కరెంట్‌ వెలుగుకు కూడా నోచుకోకుండా దుర్భర జీవితం గడుపుతున్నాడు. ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను మన ప్రభుత్వం గుర్తిస్తే ప్రపంచస్థాయి క్రీడల్లో మనదేశ పేరుప్రతిష్టలను నిలబెడతారని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

    ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి: మల్లేశం
    ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే అంతర్జాతీయస్థాయిలో రాణిస్తా. నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఎలాంటి ఆదరణలేదు. నాన్న ఆకాల మరణంతో డిగ్రీకూడా చదవలేని దుస్థితిలో ఉన్నా. నాకు చిన్ననాటి నుండి యోగా అంటే ప్రాణం. అధికారులు, పాలకులు నాకు ‍ప్రోత్సాహం అందిస్తే కఠోరమైన సాధనచేసి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తా..

మరిన్ని వార్తలు