పేదరికం తగ్గుతోంది!

20 Oct, 2023 00:29 IST|Sakshi

అభిప్రాయం

దేశంలో గత ఐదేళ్లలో రెండేళ్లు కరోనా మహమ్మారి ఇబ్బందిపెట్టినా పేదరికం తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ, విద్యా, వైద్య పథకాల ఫలితమేనని చెప్పవచ్చు.

నీతి ఆయోగ్‌ నివేదిక –2023ను పరిశీలించినప్పుడు దేశంలో పేదరికం పరిస్థితి ఇటీవలి సంవత్సరాల్లో (2015–16, 2019–21) ఎలా ఉందో స్పష్టమవుతోంది. సుస్థిరాభివృద్ది లక్ష్యాలు (ఎస్‌డీజీ)... సామాజిక–ఆర్థిక, సామాజిక శ్రేయస్సు కొరకు ‘ఎవరినీ వదిలి పెట్టకూడదు’ అనే దృష్టితో నిర్దేశించబడ్డాయి.

అంటే ఆదాయంతో ముడిపడిన పేదరికమే కాకుండా, మిగతా అన్ని వసతు లనూ పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేసి దాని నిర్మూలించడం కూడా ఒక లక్ష్యమన్నమాట. అనేక కోణాలను పరిగణన లోకి తీసుకుని పేదరికాన్ని అర్థం చేసుకోవాలి.

ఉదాహరణకు, అవసరమైన వసతులు... అంటే నీరు, పారిశుద్ధ్యం, పోష కాహారం, శిశు, ప్రసూతి మరణాలు, పాఠశాల హాజరు, ఇతర ప్రాథమిక గృహ సౌకర్యాలు పొందడం వంటి వాటినన్నిటినీ పేదరికాన్ని నిర్వచించడంలో పరిగణించాలి.

ఇటువంటి పేదరిక అంచనా కోసం నిర్దేశించిన 12 సూచికలలో పదింటిని, ప్రపంచ స్థాయిలో పేదరికాన్ని అంచనా వేయడానికి  చేర్చినవి కాగా మిగిలిన రెండు సూచికలు: ప్రసూతి ఆరోగ్యం, బ్యాంక్‌ ఖాతాలు దేశంలో పేదరికాన్ని అంచనావేయడానికి అదనంగా చేర్చబడ్డాయి. ఇటువంటి అనేక కోణాల ఆధారంగా నిర్ధారించిన పేదరికం (ఎంపీఐ) జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులలో ఎలా ఉందో నీతి ఆయోగ్‌ తాజా నివేదిక తెలియజేస్తోంది. 

దేశ స్థాయిలో పేదరికం బాగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. 2015–16లో మన జనాభాలో 25 శాతం పేదలు ఉండగా, 2019–21 నాటికి 15 శాతానికి పేదరికం తగ్గింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని వేసిన అంచనా దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని సూచిస్తోంది. సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలు 2030 కంటే ముందుగానే, భారతదేశం సాధించవచ్చని ఇది చెబుతోంది.

మొత్తం 12 సూచి కలు అభివృద్ధిని చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేగంగా తగ్గుముఖం పట్టింది. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 8.65 శాతం నుండి 5.27 శాతానికి పేదరికం తగ్గింది. 28 రాష్ట్రాలలో, పది రాష్ట్రాలు 2019–21లో దేశ సగటు 14.96 శాతం కంటే ఎక్కువ శాతం పేదరికాన్ని నమోదు చేశాయి.

దేశంలో అత్యల్పంగా కేరళలో ఒక శాతం కంటే తక్కువ మంది పేదలుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో పేదల శాతం దేశ సగటు కంటే చాలా తక్కువగా ఉంది.2019–21లో దేశ సగటు పేదరిక స్థాయి కంటే, తెలుగు రాష్ట్రాల్లో, పైన చెప్పిన విధంగా అంచనా వేసిన పేదల శాతం చాలా తక్కువగా ఉంది.

ఇది 2015–16 లో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 12 నుండి 13 శాతం ఉండగా, 2019–21 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో 6 శాతానికి తగ్గింది. పేదరిక అంచనాలో ఉపయోగించిన సూచికలలో, పిల్లల–కౌమార మరణాలు, పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల హాజరు, విద్యుత్‌ సౌకర్యం, ఆస్తులు కలిగి ఉండటం వంటివి రెండు తెలుగు రాష్ట్రాలలో సమాన శాతంలో ఉన్నాయి. 

 2023 ఏడాదిలో విడుదల అయిన నీతి ఆయోగ్‌ నివేదిక, కరోనా వైరస్‌ కారణంగా ఆర్థికంగా, సామాజికంగా అతలా కుతలం అయిన కాలాన్ని అనగా 2019–21ను ప్రతిబింబిస్తోంది. పేదరిక నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు బహుసూచికలతో పొందు పరచిన పేదరిక శాతాన్ని తగ్గించడంలో బాగా సహాయ పడ్డాయి. 

ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్‌ఆర్‌ అమ్మ ఒడి’, ‘వైఎస్‌ఆర్‌ జగనన్న విద్యా దీవెన’, ‘వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’, గృహనిర్మాణ పథకం; తెలంగాణలో ‘ఆరోగ్య లక్ష్మి’, గృహనిర్మాణ పథకం, ‘కేసీఆర్‌ కిట్‌’ ‘మిషన్‌ భగీరథ’ పథకాలు పేదరిక శాతాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడ్డాయి.

అదనంగా, రెండు రాష్ట్రాలలో, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయడం కూడా పాఠశాల హాజరు, తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహద పడుతున్నాయి. ఈ పథకాల పూర్తి ప్రభావం తదుపరి నీతి ఆయోగ్‌ నివేదికలో ఎక్కువగా ప్రస్ఫుటం గావచ్చు. ఈ పథకాల ప్రభావంతో, తెలుగు రాష్ట్రాలలో, పేదరిక నిర్మూలన గణనీయంగా తగ్గవచ్చు.
డా‘‘ పృథ్వీకర్‌ రెడ్డి 
వ్యాసకర్త ఆర్థిక అంశాల నిపుణుడు
ఈ–మెయిల్‌: prudhvikar@cess.ac.in

మరిన్ని వార్తలు