కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి

3 Jul, 2016 02:01 IST|Sakshi
కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క

సంగారెడ్డి రూరల్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని  రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.  సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి పీఎస్‌ఆర్ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంస్థల సమావేశంలో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు.  ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ముస్లింలకు 14 శాతం రిజర్వేషన్ ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు.  ఏడాదికి 2 లక్షల ఇళ్లు, రూ. 5.5 లక్షల వ్యయంతో నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి వచ్చే మూడేళ్లలో 6 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందని, అందుకు రూ. 46 వేల కోట్లు అవసరమన్నారు. 

ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు.   డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి అనుబంధ సంఘాల నాయకులు, కార్యాకర్తలు కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయి మైనార్టీ , ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్  కమిటీలను ఏర్పాటు చేశారు.  సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ,   మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాష్ట్ర నాయకులు జెట్టి కుసుమ్ కుమార్, జైపాల్‌రెడ్డి,  మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా ఫక్రుద్దీన్,  సంజీవ్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డితో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు