జల్సాలతో పెడదోవ

25 Aug, 2016 22:35 IST|Sakshi
జల్సాలతో పెడదోవ
 నూజివీడులో ముగ్గురు బైక్‌ దొంగల పట్టివేత
నూజివీడు :
సినిమాలు, షికార్లు జల్సాలకు అలవాటుపడిన యువకులు ఈజీ మనీ కోసం బైక్‌ దొంగతనాలకు దిగారు.  చివరకు పోలీసులకు దొరికిపోయారు. బైక్‌చోరీలకు సంబంధించి నూజివీడు సీఐ ఎం.రామ్‌కుమార్‌ గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం రామరాజులంక కు చెందిన మత్తేప్రవీణ్‌ నూజివీడులో పాలిటెక్నిక్‌ సెకెండియర్, పట్టణంలోని కొప్పుల వెలమపేటకు చెందిన సబ్బవరపు సూర్యతేజ ఇంటర్, కోనేరుపేటకు చెందిన గండి దుర్గాకళ్యాణ్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరు వ్యసనాలకు లోనై నాలుగు నెలలుగా నూజివీడు, విజయవాడ ప్రాంతంలో ద్విచక్రవాహనాలను దొంగిలించి, వాటి నెంబరు ప్లేట్లను తీసేసి  నూజివీడు ప్రాంతంలో తాకట్టుపెట్టడం, రోజువారీ అద్దెకు ఇవ్వడం చేస్తున్నారు. గొడుగువారిగూడెం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గుట్టు రట్టయింది. ఎనిమిది బైక్‌లను పోలీసులు రికవరీ చేశారు. అందులో 2  బుల్లెట్లు, 4 పల్సర్‌లు, 1 అపాచి, 1 యమహా స్పోర్ట్స్‌బైక్‌ ఉన్నాయి. వీటిలో మూడు విజయవాడ నగరంలోని పటమట, గవర్నర్‌పేట, మాచవరం ప్రాంతాలలో దొంగిలించినవి కాగా, నూజివీడు పట్టణంలో 3, మండలంలో 2 బైక్‌లను ఎత్తుకెళ్లారు. ఈ కేసులో కృషిచేసిన పట్టణ ఎస్‌ఐ ఎన్‌ చలపతిరావు, రూరల్‌ ఎస్‌ఐ చిన్ని నాగప్రసాద్, సిబ్బందిని సీఐ అభినందించారు. 
 
 
మరిన్ని వార్తలు