విదేశాలకు బైవోల్టిన్‌ ఎగుమతి

27 Aug, 2016 00:18 IST|Sakshi
బీజ క్షేత్రంలో మల్బరీఆకు నాణ్యతను పరిశీలిస్తున్న శివారెడ్డి
 
–కేంద్రపట్టుశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చేలూరి శివారెడ్డి 
బి.కొత్తకోట: ఒకప్పుడు రైతులు బైవోల్టిన్‌ సాగుచేసేందుకు ముందుకురాని పరిస్థితుల నుంచి విదేశాలకు బైవోల్టిన్‌ హైబ్రిడ్‌ను ఎగుతుమలు చేసే స్థాయికి దేశం ఎదిగిందని కేంద్రపట్టు పరిశ్రమశాఖ ప్రధానకేంద్రం బెంగళూరు జాయింట్‌ డైరెక్టర్‌ చేలూరి శివారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం మొగసాలమర్రి సమీపంలోని కేంద్ర పట్టుశాఖకు చెందిన ప్రాథమిక బీజ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో 21 పట్టుగ్రుడ్ల ఉత్పత్తి కేంద్రాలు, మరో 21 మూల బీజక్షేత్ర కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తి కేంద్రాల ద్వారా గత ఆర్థిక సంవత్సరం 375 లక్షల వాణిజ్య పట్టుగ్రుడ్ల ఉత్పత్తి లక్ష్యంకాగా 410 లక్షల గ్రుడ్లను ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 410లక్షల గ్రుడ్లను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యమన్నారు. ఇందులో 350లక్షల బైవోల్టిన్‌ హైబ్రీడ్‌ గ్రుడ్లను ఉత్పత్తి చేయాల్సివుందన్నారు. కాగా ప్రస్తుతం బైవోల్టిన్‌ హైబ్రిడ్‌ గ్రుడ్లు నేపాల్, ఇథియోపియా, కెన్యా, రువాండా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా తయారవుతున్న గ్రుడ్లు రోగరహితమైనవి కావడంతో వీటి ఫలితాలు అధికంగా వస్తున్నాయని చెప్పారు. వీ1 మల్బరీ స్థానంలో కొత్తగా జీ2, జీ4 వంగడాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీనిద్వారా ఏడాదికి ఆరుపంటలు తీయవచ్చని, తద్వారా సగటున రూ.3లక్షల ఆదాయం దక్కుతుందన్నారు. కాగా క్లస్టర్‌ ప్రమోషన్‌ ప్రోగ్రాం పేరుతో దేశంలో 172 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్లస్టర్లద్వారా బైవోల్టిన్‌ హైబ్రీడ్‌ సాగు విస్తరణ పెరిగేలా చూడటమే లక్ష్యమన్నారు. ఏపీలో రాష్ట్రప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. దీనికోసం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సంకరజాతీ గ్రుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రైతులు అధిక లాభాలు పొందేందుకు బైవోల్టిన్‌ హైబ్రిడ్‌సాగుపై దష్టి పెట్టాలన్నారు. దీనికోసం రైతులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని చెప్పారు. కేంద్రప్రభుత్వం దీనిపై ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు. 2016–17లో 33వేల టన్నుల పట్టును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా కేంద్రం నిర్ణయించగా  2023నాటీకి 41,800 టన్నుల పట్టును ఉత్పత్తి లక్ష్యమన్నారు. తద్వారా చైనాపై ఆధారపడటం పూర్తిగా తగ్గిపోతుందని, ఒకదశలో 5వేల టన్నులు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని  చెప్పారు.
 
 
 
>
మరిన్ని వార్తలు