బకింగ్‌హాంకు విముక్తి లభించేనా ?

17 Aug, 2016 01:30 IST|Sakshi
బకింగ్‌హాంకు విముక్తి లభించేనా ?
 
  • అనుమానంగా ఆక్రమణల తొలగింపు
  • నాలుగు నెలల క్రితమే సర్వే పూర్తి
  • తదుపరి చర్యలు కరువు
  • కాలువ భూముల్లో జోరుగా రొయ్యల సాగు 
జలరవాణా పరంగా ఓ వెలుగు వెలిగిన బకింగ్‌హాం కాలువకు పూర్వవైభవం రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. కాలువకు మహర్దశ పట్టించి జల రవాణాను పునరుద్ధరిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం తడబడుతోంది. సర్వేల పేరుతో కాలయాపన చేస్తుండటంతో కాలువ ఆక్రమణ దారుల కబంద హస్తాల్లో చిక్కుకుపోయింది. ఓ వైపు ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా మరోవైపు కాలువ భూముల్లో రొయ్యల సాగు జోరుగా సాగుతోంది. 
 
వాకాడు: బకింగ్‌హాం కాలువ రోజురోజుకూ బక్కచిక్కిపోతోంది. ఆధునికీకరణ పేరుతో కేంద్రప్రభుత్వం చేపట్టిన సర్వే పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం పాలకుల చిత్తశుద్ధిని శంకిస్తోంది. ఒకప్పుడు జల రవాణాలో కీలకప్రాత పోషించిన ఈ కాలువ ఆ తర్వాత కాలంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై ఆక్రమణల్లో చిక్కుకుపోయింది. 
బ్రిటిష్‌ దొర బకింగ్‌ హామ్‌ జలరవాణా కోసం 1896లో కాకినాడ నుంచి చెన్నై వరకు ఆ కాలువను నిర్మించారు. బకింగ్‌హాం కాలువకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు గోదావరి కాలువగా, ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి విజయవాడ వరకు ఏలూరు కాలువగా, విజయవాడ నుంచి పెదగంజాం లాకుల వరకు కొమ్మమూరు కాలవగా, పెద్ద గంజాం నుంచి రాష్ట్ర సరిహద్దు తడ వరకు బకింగ్‌హామ్‌ కాలువ, ఉప్పు కాలవగా పిలుస్తారు. 100 మీటర్ల వెడల్పు ఉండాల్సిన ఈ కాలవ ప్రస్తుతం 10 మీటర్లకు కుంచించుకుపోయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కాలువను ఆధునికీకరించి జలరవాణాను పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సర్వే బృందాలు ఎనిమిది నెలలుగా అత్యాధునిక గ్లోబల్‌ జీపీఎస్‌ టెక్నాలజీతో సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ప్రక్రియ ఏప్రిల్‌లో ముగిసింది. కాలువకు సంబంధించిన వేలాది ఎకరాల భూమి ఆక్రమణలో ఉన్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. 
అనేక అవాంతరాల తర్వాత..
బకింగ్‌హాం కాలువ పునరుద్ధరణకు అనేక సార్లు ప్రయత్నాలు జరిగాయి. దేశీయ జలమార్గాలను పునరుద్ధరించాలని ఇన్‌లాండ్‌ వాటర్‌ హౌస్‌ అథారిటీ ‘ఇవ్వా’ చేసిన ప్రతిపాదనలను అమలుచేయాలని 1994లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి.  సర్వే బాధ్యతలను రైట్స్‌ ఇండియా సంస్థకు అప్పగించాయి. అయితే అప్పట్లో సర్వేప్రక్రియ కాగితాలను దాటలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు సర్వే చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు గత ఏడాది కావలి మండలం చెన్నాయపాళెం వద్ద సర్వే ప్రారంభించాయి. ఆరంభంలో నత్తనడకన సాగిన సర్వే తర్వాత వేగం పుంజుకుంది. కావలి నుంచి ఊటుకూరు వరకు ఓ బిట్‌గా, కుడిపాళెంలోని పెన్నానది తీరం నుంచి ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వరకు మరోబిట్‌గా, కృష్ణపట్నం నుంచి తడ వరకు మూడో బిట్‌గా విడగొట్టి సర్వే పూర్తి చేశారు. సర్వే నివేదికలతో ఆక్రమణల వివరాలను మొదట విజయవాడలోని హెడ్‌ ఆఫీస్‌కి పంపి అక్కడ పరిశీలన అనంతరం ఆయా మండలాల రెవిన్యూ అధికారులకు పంపాలి. అయితే సర్వే పూర్తయి నాలుగు నెలలు దాటుతున్నా ఆక్రమణల వివరాలు బయటకు రాకపోవడం, ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వకపోవడం, కనీసం హద్దు రాళ్లు కూడా నాటకపోవడం పాలకుల చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు వాకాడు మండలంలోని బకింగ్‌హాంకాలువ భూముల్లో వెనామీ రొయ్యల సాగు ఇష్టారాజ్యంగా సాగుతోంది. 
 
సర్వే అలైన్‌మెంట్‌ పూర్తి చేశాం: వీరకుమార్, డీఈ, బకింగ్‌హాం కెనాల్‌ 
నాలుగు నెలల క్రితమే సర్వే అలైన్‌మెంట్‌ పూర్తి చేశాం. దానికి సంబంధించిన నివేదికలను విజయవాడకు పంపాం. అక్కడ ఆమోదం లభించిన తర్వాత మిగిలిన దశ పనులు ప్రారంభమవుతాయి.  

 

మరిన్ని వార్తలు