గండి.. ఎప్పటికి పూడ్చేనండి

4 Aug, 2016 21:51 IST|Sakshi
గండి.. ఎప్పటికి పూడ్చేనండి
సీతారామపురం (నూజివీడు) : రామిలేరుపై ఉన్న పోలవరం కుడికాలువ అండర్‌ టన్నెల్‌ వింగ్‌ వాల్‌కు పడిన గండి ఇప్పట్లో పూడ్చే పరిస్థితులు కనిపించట్లేదు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాలుగు రోజుల నుంచి పోలవరం కాలువపై మకాం వేసినప్పటికీ పోలవరం కాలువ అండర్‌ టన్నెల్‌కు పడిన గండి పూడ్చివేత పనులు ముందుకు సాగడం లేదు. ఈ నెల ఒకటో తేదీ తెల్లవారుజామున ఇక్కడ గండిపడిన విషయం తెలిసిందే.  ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి ఉమా అప్పటి నుంచి రేయింబవళ్లు కాలువ వద్దే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు కూడా గండిపడిన నాటి నుంచి రోజూ కాలువ వద్దే ఉంటున్నారు. గండిపడి నాలుగు రోజులు గడిచినా నేటికీ పూడ్చివేత పనులు ఊపందుకోలేదు. కాలువలో నీటి ప్రవాహం తగ్గడానికి రెండు రోజులు పట్టడంతో అప్పటి వరకు ఎలాంటి పనులు చేసేందుకు వీలుపడలేదు. నీరు తగ్గిన తరువాత గండి పడిన ప్రాంతానికి చుట్టూ రింగ్‌ బండ్‌ వేసేందుకు రెండు రోజులు గడిచింది. గండి పడడం వల్ల అండర్‌ టన్నెల్‌కు పొడిగింపుగా ఉన్న అప్రాన్‌ కూడా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో గండిని తాత్కాలికంగా పూడ్చి గోదావరి జలాలను విడుదల చేయాలా, లేక ఒక్కసారి శాశ్వత పనులు చేయాలా అనే దానిపై ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడిన మీదట ఎట్టకేలకు శాశ్వత పనులను ఎలాంటి హడావుడి లేకుండా  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, గురువారం సాయంత్రం వరకు కూడా గండి పూడ్చడానికి, అప్రాన్‌ నిర్మాణానికి కాంక్రీట్‌ వేసేందుకు అవసరమైన యంత్రాలు ఏవీ రాకపోవడంతో ఇంకా కాంక్రీట్‌ పనులు పూర్తికాలేదు. శుక్రవారం నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 
పెరుగుతున్న సందర్శకుల తాకిడి 
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘటనాస్థలిలోనే మకాం వేసి ఉండడంతో ఆ పార్టీ నాయకుల రాకపోకలు, హడావుడి ఎక్కువవుతోంది. మాములు సమయాల్లో మంత్రి  బిజీగా ఉండటం, ఇతర జిల్లాల్లో పర్యటించడం తదితర కార్యక్రమాలతో జిల్లా నాయకులకు అందుబాటులో ఉండేవారు కాదు. దీంతో ఉమాను కలవాలంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు గండి పడిన ప్రాంతంలోనే ఆయన ఉండటంతో ఉమాను సులువుగా కలవవచ్చనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచి వస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండంతో పనులకు అంతరాయం కలిగి జాప్యం జరుగుతోంది. 
పుష్కరాల నాటికి నీరు విడుదలయ్యేనా?
వింగ్‌వాల్‌కు పడిన గండిని పూడ్చివేసే పనులతో పాటు అప్రాన్‌ నిర్మాణ పనులు కూడా రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత కాంక్రీట్‌ క్యూరింగ్‌ పీరియడ్‌ కనీసం ఐదారు రోజులైనా ఉండాలి. మొత్తంమ్మీద కనీసం ఎనిమిది రోజులకు పనులు పూర్తయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత పట్టిసీమలో పంపులను ఆన్‌ చేయనున్నారు. ఇదంతా జరిగే సరికి పుష్కరాలు ప్రారంభమయ్యే 12వ తేదీ రానే వస్తుంది. ఒకవేళ పట్టిసీమలో పంపులను ఈనెల 12న ఆన్‌ చేసినా అక్కడి నుంచి గోదావరి జలాలు కృష్ణానదికి చేరేసరికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. వీటన్నింటిని బట్టి చూస్తే పుష్కరాల నాటికి గోదావరి జలాలు వచ్చే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
 
 
 
 
మరిన్ని వార్తలు