పుష్కర సొమ్ములతో రియల్ ఎస్టేట్ దందా!

19 Jul, 2015 10:58 IST|Sakshi
కొవ్వూరులో ఏర్పాటు చేసిన స్విస్ కాటేజీలు

సాక్షి, కొవ్వూరు : ప్రభుత్వ సొమ్ములను ఉపయోగించుకొని తమ రియల్‌ఎస్టేట్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో తెలుగుదేశం నేతల్లో అపారమైన ప్రతిభ కనిపిస్తోంది. ఇప్పటికే రియల్‌ఎస్టేట్ వ్యాపారిగా పేరు పొందిన గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎంపీ, కొంతమంది తెలుగుదేశం నేతలు కొవ్వూరు ప్రాంతంలో తమ రియల్ ఎస్టేట్ వెంచర్‌ను అభివృద్ధి చేసుకోవడానికి పుష్కర నిధులను విజయవంతంగా ఉపయోగించుకొన్నారు.

కార్నివాల్ పేరుతో తమ భూములున్న చోటికి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం వెచ్చించిన డబ్బుతో రోడ్లు వేయించుకొని, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొన్నారు ఈ నేతలు. లక్షల మంది పుష్కరయాత్రికులు వస్తున్న కొవ్వూరుకు సమీపంలో మినీ బైపాస్ రోడ్డు దగ్గర ఏర్పాటు అయిన కార్నివాల్ వెనుక పెద్ద కథే ఉంది.

పుష్కర యాత్రికులకు తాత్కాలిక వసతి సౌకర్యం కల్పిస్తామని, పడక మొదలుకుని వినోదం వరకు ఎన్నెన్నో హంగులు.. నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో విదేశాల్లో ఉన్నట్టుగా భ్రమింపచేసే వాతావరణంతో కార్నివాల్‌ను ఏర్పాటు చేస్తామని ఒక ప్రైవేట్ సంస్థ కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసింది. మొదటగా దీన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఆ కార్నివాల్‌ను వ్యూహాత్మకంగా కొవ్వూరుకు మళ్లించారు రాజమండ్రికి చెందిన ఒక ప్రజాప్రతినిధి. కొవ్వూరు ప్రాంతంలో తమకు చెందిన వంద ఎకరాల పరిధిలో ఆ కార్నివాల్‌ను ఏర్పాటు చేయించారు. దీని వల్ల ఆ రియల్ ఎస్టేట్‌వ్యాపారీ కమ్ ప్రజాప్రతినిధికి రెండు లాభాలున్నాయి.

ఒకటి కార్నివాల్ ఏర్పాటు చేస్తున్నారన్న పేరుతో తమ భూములకు పుష్కర నిధులతో రోడ్లు వేయించుకోవచ్చు. రెండు కార్నివాల్ నిర్వాహకుల చేత తమ భూములను చదును చేయించవచ్చు. ఈ రెండు విషయాల్లోనూ ఆయన విజయవంతం అయ్యారు. రూపాయి ఖర్చు లేకుండా భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి రోడ్డు వేయించుకొన్నారు. పుష్కరాల రోజుల్లోనే కార్నివాల్ అక్కడ ఉంటుంది. ఆ తర్వాత సర్వసౌకర్యాలతో ఉండే రియల్‌ఎస్టేట్ వెంచర్ టీడీపీ నేతలసొంతం అవుతుంది. సుమారు రూ.50 లక్షల ప్రభుత్వ నిధులతో పొలాల్లో 60 అడుగుల రోడ్లు నిర్మించారు.

కాటేజీలు ఖరీదుగురూ...
కార్నివాల్‌లో స్విస్ కాటేజ్‌ల పేరుతో 300 కాటేజీలు నిర్మాణం, 200 రెయిన్ ప్రూఫ్ టెంట్ల కింద బెడ్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో ఉండాలంటే 12 గంటలకు రూ. 16 వేలు అద్దెగా నిర్ణయించారు. నాన్ ఏసీ కాటేజీ రూ. 12వేలు, డార్మెటరీ అద్దె రూ.1,500 గా నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు