‘ఆత్మ’బంధువులు

15 Jul, 2017 23:05 IST|Sakshi
‘ఆత్మ’బంధువులు

– అనా«థ మృతదేహాలకు స్వచ్చందంగా అంత్యక్రియలు
–  నిస్వార్థంగా కొనసాగుతున్న సేవ


అనాథలకు సేవ చేయడం ఏన్నో యజ్ఞాలకు సమానమని పురాణాలు చెబుతున్నాయి. ఎంత బతుకు బతికినా నలుగురితో మంచిగా ఉండాలని పెద్దలంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరు రాకపోయినా ఆ నలుగురైనా మృతదేహాన్ని శ్మశానం వరకు మోసుకుపోతారని చెబుతుంటారు. ఎవరూ లేకుండా భిక్షాటన చేసే వారికి.. ఎవరో తెలియక అర్ధాంతరంగా చనిపోయిన వారి పరిస్థితి ఏమిటి? అలాంటి వారికి మేమున్నామంటూ ఆత్మబంధువుల్లా ముందుకు వచ్చి కులమత ప్రాంత భేదాలు లేకుండా సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు.
- హిందూపురం అర్బన్‌

హిందూపురంలోని లైఫ్‌ వరల్డ్‌ చారిటబుల్‌ ట్రస్టు కన్వీనర్‌ ఉయద్, ముస్లిం నగర అధ్యక్షుడు ఉమర్‌ ఫరూక్, బీఎస్పీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, టైలర్‌ గంగాధర్‌ తదితరులు బృందంగా ఏర్పడి అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాన్ని వారు ఏళ్ల తరబడిగా కొనసాగిస్తూ వస్తున్నారు. అనాథ శవం అని సమాచారం అందితే చాలు ఎవరు ఎక్కడున్నా అరగంటలో ఒకచోటికి చేరుకుంటారు. చనిపోయిన వ్యక్తి ఏ మతానికి చెందిన వాడో తెలుసుకుని సంప్రదాయ రీతిలో దాత చలపతి ఆర్థిక సహకారంతో అంత్యక్రియలు చేస్తారు.

అంతకన్నా పుణ్య కార్యమేముంది
అనాథ శవాలకు సంప్రదాయంగా అంత్యక్రియలు చేయడం చిన్న విషయం కాదు. ఎన్ని పనులున్నా వదులుకుని సేవా భావంతో ఈ బృందం చేస్తున్న కార్యం చాలా మంచింది. కొత్తబట్టలు కట్టి ఖననం చేసి ఆ మతాచారం ప్రకారం ప్రార్థనలు చేసి వారి ఆత్మశాంతిని కోరుకోవడం కన్నా పుణ్యం మరొకటిలేదని నా అభిప్రాయం.
- ఈదూర్‌బాషా, సీఐ, హిందూపురం

సహకారం అందించాలి
వీరిని అనాథల ఆత్మ బంధువులుగా చెప్పవచ్చు. వారి వ్యక్తిగత కార్యక్రమాలు ఏమున్నా చేస్తున్న సామాజిక సేవాకార్యక్రమం చాలా గొప్పది. సామాన్యంగా ఎవరైనా చనిపోయారని తెలిస్తే ఆ వీధిలో కూడా పోకుండా పక్కకు వెళ్లిపోతుంటారు. అలాంటిది ఎవరు ఏమిటో తెలియకున్నా శవపరీక్షలు చేయించి దగ్గరుండి అంత్యక్రియలు చేయడం ఎంతో ఉత్తమమైన కార్యం. వీరికి అందరూ సహకారం అందించాలి.
- రామచంద్రారెడ్డి, బార్‌ అసిసోసియేషన్‌ అధ్యక్షుడు, హిందూపురం.

రక్తదానం కూడా చేస్తుంటారు
ఈ బృంద సభ్యులు అనాథ« శవాలకు అంత్యక్రియలు చేయడంతోపాటు అత్యవసరమైన సమయంలో చాలామందికి రక్తదానం కూడా చేస్తుంటారు. వీరి సేవా గుణాన్ని ప్రశంసించాల్సిందే. ఎక్కడైనా అనాథలు అనారోగ్యంతో ఉన్నా తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తుంటారు. అవసరమైన సదుపాయలు సమకూర్చుతారు. చనిపోతే దగ్గరుండి బంధువులా అంత్యక్రియలు చేస్తుంటారు.
- డాక్టర్‌ కేశవులు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, హిందూపురం

మరిన్ని వార్తలు