జల్సాలకు పోయి.. కటకటాల పాలై...

21 Sep, 2016 22:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
 • మల్యాలలో గొలుసుదొంగల ముఠా అరెస్టు
 • ముగ్గురి రిమాండ్‌.. నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం
 • సిద్దిపేట జోన్‌: జల్సాలకు అలవాటుపడ్డ కొందరు.. దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.  బుధవారం సిద్దిపేట రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జి డీఎస్పీ షేక్‌లాల్‌ అహ్మద్‌ వెల్లడించిన వివరాలు ఇలా...

  సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్కు (ఇందిరా కాలనీ)కు చెందిన వేముల శాంతారాం (25) మామిడాల గణేశ్‌(23), కొంచెం అశోక్‌ (22)తోపాటు కస్తూరి ప్రశాంత్‌ (17)లు ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలు చేసేందుకు డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

  సెప్టెంబర్‌ 7న బెజ్జంకి మండలం దాచారం చౌరస్తాలో ఓ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. ఆగస్టు 30న సిరిసిల్ల మండలం జిల్లెల్ల శివారులో మరో మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారాన్ని ఈ మూఠా దొంగిలించింది. మరోవైపు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది శివారులో జూన్‌ 22న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తస్కరించారు.

  ఈనెల 18న జక్కాపూర్‌ శివారులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించే  ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిన్నకోడూరు ఎస్‌ఐ అశోక్‌ ఆధ్వర్యంలో పోలీస్‌లు మల్యాల చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై శాంతారాం, గణేశ్‌, అశోక్‌, ప్రశాంత్‌లు పోలీసులకు అనుమానాస్పదంగా కన్పిపించారు.

  వారిని అదుపులోకి తీసుకోని విచారించగా గొలుసు దొంగతనాలకు పాల్పడిన వివరాలను వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని శాంతారాం, గణేశ్‌, అశోక్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే సంఘటనలో మైనర్‌ బాలుడు ప్రశాంత్‌ను సంగారెడ్డిలోని జువైనల్‌ హోంకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్‌ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు