అచ్చన్నా.. నీ సంగతి చూసుకో!

26 Jan, 2016 16:04 IST|Sakshi
అచ్చన్నా.. నీ సంగతి చూసుకో!

ఇతరశాఖలపై ఫిర్యాదులు తర్వాత.. అచ్చెన్నాయుడుపై చంద్రబాబు ఆగ్రహం
‘చంద్రన్న కానుక’ను అభాసుపాల్జేశారు
నాపేరు పెట్టి నాసిరకం వస్తువులిచ్చారు
పరిటాల సునీతపై సీఎం తీవ్ర అసంతృప్తి
రాజధాని రైతుల నిరసనలు పసిగట్టలేకపోయారు
నారాయణ, దేవినేని, పుల్లారావులకూ అక్షింతలు

 
సాక్షి, హైదరాబాద్: ‘అచ్చెన్నా.. అన్ని శాఖల గురించి ఫిర్యాదు చేయడం నీకు అలవాటైపోయింది... ముందు నీ శాఖ గురించి నువ్వు చూసుకో’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్వరంతో హెచ్చరించే సరికి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బిత్తరపోయారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరుగంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అచ్చన్నాయుడుతో పాటు మరికొందరు మంత్రుల పనితీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

సమావేశంలో శాఖలపై సమీక్ష సందర్భంగా రహదారులు, భవనాల పనితీరు పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మంత్రి అచ్చన్నాయుడు మాత్రం రోడ్లు సక్రమంగా లేవని అన్నారు. తనతో పాటు మిగిలిన వారు రోడ్లు బాగున్నాయని చెప్తుంటే అచ్చెన్నాయుడు బాగా లేవని చెప్పటంతో... ‘ప్రతి శాఖ పనితీరు బాగా లేదని చెప్పటం నీకు అలవాటైపోయింది. ముందు నీ శాఖ పనితీరు బాగా జరిగేలా చూసుకో, పట్టుపెంచుకో, మిగిలిన శాఖలపై తరువాత ఫిర్యాదు చేద్దువుగాని’ అన్నట్లు తెలిసింది.

తనపేరుతో ప్రకటించిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పథకం అభాసుపాల్జేశారంటూ ముఖ్యమంత్రి వాపోయారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు పర్యవేక్షణ సరిగా లేదంటూ ఆ శాఖమంత్రి పరిటాల సునీత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వస్తువులు సరఫరా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మీ వల్ల నాకు ఇబ్బందులు...
రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో రైతుల నుంచి నిరసన వ్యక్తమౌతున్నా పసిగట్టడంలో విఫలమైన మంత్రులు పి. పుల్లారావు, పి. నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వ్యవహారశైలి, శాఖలపై పట్టు పెంచుకోకపోవటం వల్ల నేను ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆయన ఈ సందర్భంగా ఘాటుగానే అన్నట్లు సమాచారం. ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే తొలి నుంచి రాజధాని వ్యవహారాలు పర్యవే క్షిస్తున్న మంత్రి నారాయణతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది.

మంత్రులందరూ రైతుల్లో అసంతృప్తిని గుర్తించటంలో విఫలం అయ్యారని, ఇక నుంచి సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పినట్లు తెలిసింది. సాగునీటి శాఖ పనితీరు వల్ల ప్రభుత్వానికి కొంత మంచి పేరు వచ్చిందని, ఇప్పటికే రూ. తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టామని, మరో రూ. తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని  సీఎం అన్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌లోనే బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.  గుంటూరు జిల్లాలో శాసనసభ సమావే శాలు నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో హాయ్‌ల్యాండ్‌తో పాటు కేఎల్ విశ్వవిద్యాలయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సందర్శించారు. అధికారుల బృందాన్ని పంపి ఒక నివేదిక రూపొం దించి ప్రభుత్వానికి అందచేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తరువాత  మౌలిక వసతులున్న హైదరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 
 
జాబ్‌కార్డ్ ఉన్న వారితో పారిశుధ్య కార్యక్రమాలు
జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డులు కలిగిన   డ్వాక్రా మహిళలతో గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.  జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీరికి పనికి తగిన వేతనం చెల్లిస్తారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయని, వాటిని సవరిస్తే ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఉండదని సీఎం చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు.  తాను కూడా మూడు రోజుల పాటు  అక్కడ ప్రచారం చేస్తున్నానని చెప్పారు.

మరిన్ని వార్తలు