నకిలీ ట్రక్‌ షీట్ల మాయాజాలం

16 Dec, 2016 07:21 IST|Sakshi
చింతలపూడి(ప.గో) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలతో రైతులకు మద్దతు ధర అందకుండా పోతోంది. మిల్లర్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, కమీషన్‌ ఏజెంట్లు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం రవాణా చేసే ట్రక్‌షీట్ల ముసుగులో దళారులకు ప్రభుత్వ సబ్సిడీని దోచిపెడుతున్నారు. తాజాగా చింతలపూడిలో ఇటువంటి సంఘటన బయటపడిం ది. ఫాతిమాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం రవాణా అవుతున్న ఏపీ 05వై 9478 నంబర్‌ లారీని తనిఖీ చేయగా నకిలీ ట్రక్‌షీట్‌ బయటపడింది. ప్రగడవరం పంచాయతీ కార్యదర్శి మానుకొండ బ్లెస్సింగ్‌ మోజెస్‌ పేరు తో 170 క్వింటాళ్ల ధాన్యం లోడు పట్టుబడింది. వాస్తవానికి మోజెస్‌ రైతు కాదు ప్రభుత్వ ఉద్యో గి. విషయం తెలుసుకున్న మోజెస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐకేపీ అధికారుల ఫిర్యాదుతో ధాన్యం లోడును చింతలపూడి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సైదానాయక్‌ చెప్పారు. 
 
నిర్వాహకుల చేతివాటం
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం లోడు చేసే సమయంలో ఐకేపీ, రెవెన్యూ, పౌరసరఫరాల సిబ్బంది ట్రక్‌ షీట్‌ రాసి ఏ మిల్లుకు సరఫరా చేయాలో తెలియజేస్తారు. మిల్లు యజ మాని ట్రక్‌ షీట్‌ చూసి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి. ఇక్కడే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. వ్యాపారులు రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టు చూపుతూ మిల్లులకు తరలిస్తున్నారు. ఇందుకు కొనుగోలు కేంద్రం ని ర్వాహకులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్‌ వ్యాపారులు లారీకి ఇంతని కమీషన్‌ ముట్టచెబుతున్నారనే విమర్శ లు ఉన్నాయి. దీంతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లర్ల జేబుల్లోకి చేరుతోంది. 
 
నకిలీ ట్రక్‌ షీట్లు వాస్తవమే
ఫాతిమాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి నకిలీ ట్రక్‌షీట్లతో ధాన్యం రవాణా చేస్తున్న విషయం నిజమే. చెక్‌పోస్ట్‌ సిబ్బంది సమాచారంతో లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించాం. గ్రామ సంఘంతో ఫిర్యాదు చేయించాం. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ చెప్పారు. – పి.భానుమతి, ఐకేపీ ఏపీఎం 
 
మరిన్ని వార్తలు