పట్టపగలే భారీ చోరీ

7 Nov, 2016 23:03 IST|Sakshi
పట్టపగలే భారీ చోరీ
30 కాసుల బంగారం, రూ.60 వేల అపహరణ  
కాకినాడలో వృద్ధురాలిని తాళ్లతో బంధించిన వైనం
కాకినాడ క్రైం :  అది కాకినాడ భానుగుడి సెంటర్‌. సోమవారం ఉదయం 9 గంటల సమయం. ముగ్గురు ఆగంతకులు ముసుగులు ధరించి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో చొరబడ్డారు. ఆమెను తాళ్లతో బంధించి çసుమారు 30 కాసుల బంగారం, రూ.60 వేల నగదును అపహరించుకుపోయారు. వివరాల్లోకెళితే.. స్థానిక భానుగుడి సెంటర్‌ భానులింగేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీరామ్‌నగర్‌లో ఉన్న ఓ భవనం రెండో అంతస్తులో కొప్పర్తి ఆనంద్‌కృష్ణ నివసిస్తున్నారు. ఆయన ఇంట్లోకి ఉదయం 9 గంటల సమయంలో ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల  కె.రమణమ్మ నోటికి జాకెట్‌తో కట్టి, కాళ్లు చేతులు పసుపు తాడుతో బంధించారు. సుమారు రూ.7.50 లక్షల విలువైన 30 కాసుల బంగారం, అలమారాలో ఉన్న రూ.10 వేలు, బీరువాలో ఉన్న రూ.50 వేల నగదును తస్కరించారు. ఇంట్లో కారంపొడి చల్లి, పరారయ్యారు. తన భర్త ఆనంద్‌కృష్ణ  భానులింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన, కొన్ని క్షణాల్లోనే దుండగులు ఇంట్లోకి చొరబడ్డారని బాధితురాలు తెలిపింది. తొలుత ఇద్దరు ఇంటిలోకి వచ్చారని, మరో వ్యక్తి గుమ్మం వద్ద నిలబడినట్టు పేర్కొంది. సమాచారం అందుకున్న  రెండో పట్టణ క్రైం  ఎస్సై రామారావు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌తో ఆ«ధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం శ్రీరామ్‌నగర్‌కు చెందిన కొప్పర్తి రంగారావు ఇంట్లో ఇదే తరహాలో చోరీ జరిగింది.  కాగా ఆనందకృష్ణ స్వయానా రంగారావుకు సోదరుడు. రెండు చోట్ల ఒకే ముఠాకు చెందిన వారు చోరీలకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వార్తలు