మట్టి వినాయకుడికే జై

30 Aug, 2016 22:51 IST|Sakshi
మట్టితో వినాయకుడిని తయారు చేస్తున్న శ్రీకాంత్‌
 •  పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 
 •  ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, రసాయన రంగులకు స్వస్తి చెబుదాం
 •  భావి తరాలకు భరోసానిద్దాం 
 •  
  సమప్త జీవకోటికి ప్రాణధారం స్వచ్ఛమైన నీరు, గాలి, పర్యావరణం. అలాంటి నీరు, గాలి, పర్యావరణం రోజురోజుకూ కలుషితమవుతోంది. ఫలితంగా జీవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఇష్టారీతిన చెట్లు నరికివేత, వాహనాల వినియోగం, పరిశ్రమల ఏర్పాటు, సహజ రంగుల వినియోగం, తదితర వాటితో జీవకోటికి ప్రమాదం ఏర్పడుతోంది. వినాయక చవితి కూడా రానే వచ్చింది. అందుకే రసాయనాల రంగులతో కూడిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన వాటిని వాడితే పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతాం. 
  – మహబూబ్‌నగర్‌ క్రైం
   
  పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇటీవల మనం మొక్కలు నాటాం. వాటి సంరక్షణ బాధ్యతను భుజాలకెత్తుకున్నాం. పరిసరాలను మనం కాపాడితే..అవి మనల్ని కాపాడుతాయనే భావనలోంచే ఇది పుట్టింది. మరో ఐదు రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు రాబోతున్నాయి. వీధివీధినా విఘ్నేశ్వరుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రతి, ఫలాలతో ఏకదంతుడిని పూజించడానికి యువజన సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఆకర్షణీయంగా దర్శనమిస్తాడని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో పాటు వివిధ రకాల రసాయనాల కలబోతతో రంగురంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను పూజిద్దాం. నీటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. జలచరాలకు ప్రాణదానం చేద్దాం. ఇప్పటి వరకు నాటిన మొక్కలన్నీ బతికేలా పర్యావరణ పరిరక్షణ కోసం మరోసారి నడుంబిగిద్దాం.
   
  చిన్న గణపయ్యలే మహా శ్రేష్టం
  వినాయకచవితి అనగానే ఎక్కడా లేని సంతోషం. ఉత్సాహం వచ్చేస్తాయి. ఆకర్షణీయమైన రంగులతో తయారు చేసిన పెద్ద విగ్రహాల ఏర్పాటు చేసి అందరూ సంబురపడతారు. పెద్ద మైకులు పెట్టి సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం హోదాగా భావిస్తారు. దీనివల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుంది. విగ్రహాల తయారీలో ఉపయోగిస్తున్న రసాయనాలతో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. పెద్ద వినాయక విగ్రహాల తయారీకి వినియోగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, రంగులతో జలవనరులు కలుషితం అవుతున్నాయి. తొమ్మిది రోజుల సంతోషం కోసం దీర్ఘకాలిక నష్టాలను కొని తెచ్చుకోవడం ఎంతవరకు సరైన అంశమనే విషయం ఆలోచిద్దాం. రసాయన పదార్థాలతో తయారు చేసిన పెద్ద విగ్రహాల కంటే నల్లరేగడితో తయారు చేసిన చిన్న గణపయ్యలే మహా శ్రేష్టం.
   
  ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
  గ్రామాల్లో పోటీతత్వం పెరిగి అధికంగా విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడం ఎక్కువైంది. భారీ ఎత్తులో విగ్రహాలను తయారు చేసేందుకు చాలా ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లుగా అనేక పరీక్షల్లో వెల్లడైంది. వీటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితమై జలచరాలతో పాటు మన lపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రసాయన రంగులను వాడుతారు. వాటిలో సీసం, ట్రామ్, ఆర్సినిక్‌ కాపర్, కార్బోనియం, జింక్, మెర్క్యురీ, క్రోమియం వంటివి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఆ విగ్రహాలను నిమజ్జనం చేసిన నీటి వనరుల్లో లవణాల శాతం పెరిగిపోతుంది. దీంతో నీటి వనరులు పూర్తిగా కలుషితమవుతాయి.
   
  నిమజ్జనం తర్వాతే అసలు సమస్య
  రసాయనాలను వినియోగించి తయారు చేసిన వినాయకుడిని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశాకే అసలు సమస్య మొదలవుతుంది. మనం భారీగా ఖర్చుచేస్తే నష్టం కూడా భారీగానే ఉంటుంది. గొప్పగా ప్రతిష్ఠించే పెద్ద వినాయకుడి ద్వారా తిప్పలు కూడా పెద్దగానే ఉంటాయి. మన ఊరిలోని చెరువులో ఆ గణపయ్య నిమజ్జనం తర్వాత విగ్రహం నీటిలో కరగడానికి ఎన్నో నెలలు పట్టవచ్చు. ఆ గణపతి ప్రతిమలో వాడు ఇనుప చువ్వలతో జలచరాలకే కాదు ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే వారు ఉంటారు. 
   
  ప్లాస్టిక్‌పై సమరానికి ఓ యువకుడు సై
  వాతావరణ సంరక్షణకు సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేశాడో యువకుడు. స్నేహితుల సహకారం, అమ్మ ప్రోత్సాహంతో లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నాడు జిల్లాకేంద్రంలోని శివశక్తినగర్‌కు చెందిన శ్రీకాంత్‌. ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో ఈ యువకుడు ప్లాస్టిక్‌ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకుని దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్రస్తుతం సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ మరోవైపు ఎలాంటి రసాయనాలు లేకుండా బంకమట్టి, కొబ్బరిపీచుతో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఏడేళ్ల కాలంలో 50వేల మట్టి వినాయ విగ్రహాలు తయారు చేసి ప్రజలకు అందించాడు. 2010లో మట్టి వినాయక విగ్రహాలను తయారుచేయడం మొదలు పెట్టి ఆయన ప్రతి ఏడాది వేల సంఖ్యలో వాటిని తయారు చేస్తూ కాలుష్యం కాపాడేందుకు తనవంతు కషి చేస్తున్నాడు. గతేడాది 10వేల మట్టి విగ్రహాలను తయారు చేయడంతో చాలా స్పందన వచ్చిందని, ఈ ఏడాది 20వేల విగ్రహాలు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఈ సారి ఓపెన్‌ బుకింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా మట్టి విగ్రహాలను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెబుతున్నాడు.
   
  1995నుంచి ఏకో క్లబ్‌ ఆధ్వర్యంలో..
  జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీ వేదికగా పని చేస్తున్నా ఏకో క్లబ్‌ సభ్యులు జిల్లాలో పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏకో క్లబ్‌ను జిల్లాలో 1995లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి గన్నోజీ చంద్రశేఖర్‌ చైర్మన్‌గా 200మంది సభ్యులు, 500మంది వలంటీర్లుగా జిల్లావ్యాప్తంగా పని చేస్తున్నారు. ఏకో క్లబ్‌ ఆధ్వర్యంలో వేల కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పర్యావరణం రక్షించడానికి కషి చేస్తున్నారు. జిల్లాస్థాయిలో యువకులకు సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి కేవలం పచ్చదనం, నీటి వినియోగంపై చాలా ప్రచారం చేశారు. కాలుష్యాంపై అవగహన కల్పించడంలో భాగంగా క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 2వేల సదస్సులు ఏర్పాటు చేశారు.
   
  కఠినచట్టాలు అవసరం..
  విగ్రహాల తయారీలో విషపూరిత రసాయనాలు, రంగులు వాడటాన్ని రద్దు చేసి, కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ బంకమట్టితో తయారు చేసిన నీటిలో సులువుగా కరిగిపోయే విగ్రహాలను తయారు చేయాలి. దేవుడు ఏ విగ్రహంలోనైనా అదే అవతారం కాబట్టి పెద్ద విగ్రహాలు తయారు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విగ్రహాలు బంకమట్టితో చేసినవి నిమజ్జనం చేస్తే విశ్వమానవాళికి ప్రమాదం తప్పుతుంది.
  – డాక్టర్‌ చంద్రకిరణ్, పీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర విభాగం అధిపతి
   
   
   
మరిన్ని వార్తలు