అర కోటికి చేరువలో..

17 Jul, 2017 02:24 IST|Sakshi

నాటిన మొక్కల సంఖ్య 46 లక్షలకు పైగా..
► జిల్లాలో జోరుగా హరితహారం కార్యక్రమం
► గుంతల తవ్వకం, నీళ్లు పోసేందుకు ‘ఉపాధి’ నిధులు
► సుమారు రూ.3.77 కోట్ల చెల్లింపులు..  


సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. నాటిన మొక్కల సంఖ్య ఇప్పటికే అర కోటికి చేరువైంది. శనివారం నాటికి అన్ని శాఖలు కలిపి 46 లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు రికార్డు చేశారు. మూడో విడత హరితహారంలో భాగంగా 1.85 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఈ మేరకు జూన్‌ మొదటి వారం నుంచే జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ.. జిల్లాలో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుండటంతో ముందస్తుగానే మొక్కలు నాటారు.

దీంతో ఇప్పటికే నిర్దేశిత లక్ష్యంలో సుమారు 25 శాతం మేరకు మొక్కలు నాటడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌డేను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పాఠశాలల ఆవరణలో, గ్రామంలో మొక్కలు నాటించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురవక పోయినప్పటికీ, నాటిన మొక్కలు బతికేందుకు అవసరమైన వాతావరణం ఉండటంతో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నాటిన మొక్కలు మనుగడ సాగించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొక్కల చుట్టూ ముళ్ల కంచె వేయడం, ఎండిపోకుండా నీళ్లు పోయడం వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న రోజుల్లో డ్రై స్పెల్‌ (10–15 రోజులు వర్షాల్లేక పోతే) నమోదైతే మొక్కలు చనిపోకుండా ఉండేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోయాలని భావిస్తున్నారు.

రూ.3.77 కోట్ల చెల్లింపులు..
హరితహారం కార్యక్రమం అమలుకు అవసరమైన నిధులను ఉపాధి హామీ పథకం ద్వారా వెచ్చిస్తున్నారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తవ్వినందుకు గాను ఒక్కో గుంతకు రూ.21 చొప్పున, ఆ గుంతలో మొక్క నాటితే ఒక్కో మొక్కకు రూ.3 చొప్పున, మొక్క చుట్టూ కంచె నాటితే కంచెకు రూ.140 చొప్పున చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ నిధుల నుంచి ఈ బిల్లులు ఇస్తున్నారు. డీఆర్‌డీఏ (డ్వామా) ఆధ్వర్యంలో ఈసారి 70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సుమారు 36 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డు చేశారు. నాటిన ఈ మొక్కలకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేస్తున్నారు. 36 లక్షల మొక్కల్లో ఇప్పటివరకు 17.5 లక్షల మొక్కలకు సంబంధించి రూ.3.77 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.

విజయవంతానికి ఏర్పాట్లు
జిల్లాలో మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా అటవీ శాఖాధికారి ప్రసాద్‌ పేర్కొన్నారు. మొక్కలు నాటడంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. హరితహారం కింద మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. గత నెలలో బిల్లుల చెల్లింపుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడా సమస్య లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు