క్లస్టర్లు రద్దు

1 Oct, 2016 22:28 IST|Sakshi
రామాయంపేటలోని క్లస్టర్‌ కార్యాలయం

రామాయంపేట: వైద్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్లస్టర్‌ ​(సామాజిక ఆరోగ్య, పోషక కార్యాలయం)  కేంద్రాలను ప్రభుత్వం రద్దుచేసింది. గత ఐదేళ్ల క్రితం ఏర్పాటైన క్లస్టర్ల ద్వారానే  ఇప్పటివరకు 104 సర్వీసుల నిర్వహణతో పాటు రాష్ట్రీయ బాల స్వస్థ్‌(ఆర్‌వీఎస్‌కే) కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ కార్యక్రమం పర్యవేక్షణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేసే కార్యక్రమాలు  కొనసాగాయి.

మొదట్లో క్లస్టర్‌ కేంద్రాలకు ప్రజలనుంచి మంచి ఆదరణ లభించగా.. అధికారుల పర్యవేక్షణా లోపం, సరిగా మందులు రాకపోవడంతో  ఇవి నామమాత్రంగా మారాయి.  గత ప్రభుత్వ హయాంలో మంచి ఉద్దేశంతో ఈక్లస్టర్లు ఏర్పాటు చేయగా కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో వీటి  ఏర్పాటు అసంబద్ధంగా జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.  

ఒక్కో క్లస్టర్‌ పరిధిలో నాలుగునుంచి ఆరువరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను చేర్చి వీటిని ఏర్పాటు చేశారు. వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే గతంలో ఏర్పాటైన క్లస్టర్‌ కేంద్రాలగురించి సరిగా పట్టించుకోకపోవడంతో ఈ కేంద్రాలు నామమాత్రంగా మారాయి. కాగా నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో రామాయంపేట క్లస్టర్‌ ఏర్పాటైందని ఆ శాఖ సిబ్బంది  పేర్కొన్నారు. 

సాధారణంగా ఆరు లోపే పీహెచ్‌సీలతోనే  క్లస్టర్ల ఏర్పాటు జరుగగా... రామాయంపేట క్లస్టర్‌ పధిలో మాత్రం  మెదక్‌ ఏరియా ఆసుపత్రిని కలుపుకొని  ఏకంగా పది పీహెచ్‌సీలను  చేర్చారు.  రాష్ట్రవ్యాప్తంగా పది పీహెచ్‌సీలు ఏ క్లస్టర్‌లో లేవని, అప్పటి అధికారులు ఏకపక్షంగా నిబంధనలకు  విరుద్దంగా రామాయంపేట క్లస్టర్‌ను ఏర్పాటు చేశారని ఆరోపణలు వచ్చాయి. రామాయంపేట క్లస్టర్‌ పరిధిలో మొదట్లో నాలుగు 104 వాహనాలు సమకూరగా ప్రస్తుతం మూడు మాత్రమే కొనసాగుతున్నాయి.

ఇవికూడా గ్రామాలకు సక్రమంగా రావడంలేదని, పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. కాగా పర్యవేక్షణ లోపంతో ఈక్లస్టర్లతో ప్రజలకు పెద్దగా లాభం  చేకూరలేకపోగా 104 సర్వీసులు కూడా నామమాత్రంగా మారాయి. గతంలో 104 సర్వీసులు నెలకోమారు ప్రతి గ్రామానికి వెళ్లి బీపీ, షుగర్‌తోపాటు అన్ని రకాల వ్యాధులకు గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో మందులు అందజేసేవారు. ఈవాహనంలో డాక్టర్‌తోపాటు ఏఎన్‌ఎం, గైనకాలజిస్ట్‌, ఫార్మాసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌, నర్స్‌ గ్రామాలకు వెళ్లి రోగులను పరీక్షించి మాత్రలు అందజేయాలనే ఆదేశాలు ఉన్నా ఏనాడు అమలు కాలేదు. 

104తో  గ్రామాల్లో పేషంట్లకు  ఎంతో మేలు చేకూర్చినా... రాను రాను ఈసర్వీసులు నామమాత్రంగా మారాయి. ప్రస్తుతం కేవలం బీపీతోపాటు షుగర్‌ వ్యాధులకు మాత్రమే మాత్రలు  వస్తున్నాయని, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈవాహనంలో  ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే వస్తున్నారని, వారు ఇచ్చే మందులు కూడాపూర్తి స్థాయిలో ఇవ్వడంలేదని   గ్రామాల్లోని రోగులు వాపోయారు. ఈవిషయమై ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్‌లో జిల్లా వైధ్యాధికారి డాక్టర్‌ అమర్‌సింగ్‌ను సంప్రదించగా... క్లస్టర్ల రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు.

మరిన్ని వార్తలు