పారదర్శకతతో అనుమతులివ్వాలి

23 Jun, 2016 09:10 IST|Sakshi
పారదర్శకతతో అనుమతులివ్వాలి

‘టీఎస్ ఐ-పాస్’పై కలెక్టర్ సూచనలు
సంగారెడ్డి జోన్: తెలంగాణ రాష్ట్ర ఐ-పాస్ మార్గదర్శకాలను తప్పక పాటిస్తూ, పరిశ్రమల స్థాపనకు పారదర్శకతతో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ.. ఔత్సాహికుల దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిశీలించి, ఆన్‌లైన్ ద్వారా అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు.

ఆక్షేపణలు, అసంపూర్తి సమాచారం ఉన్నప్పుడు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నేరుగా తిరస్కరణకు గల కారణాలను లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. భూగర్భ జలవనరుల శాఖ, ట్రాన్స్ కో-ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్, కాలుష్య నియంత్రణ  మండలి, హెచ్‌ఎండీఏ తదితర శాఖలు ఔత్సాహికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీఎస్ ఐ-పాస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులే నేరుగా దరఖాస్తుదారులకు ఎన్‌ఓసీ జారీ చేయడం సమంజసం కాదని, జిల్లా పంచాయతీ అధికారి ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్, అనుబంధ శాఖల అధికారులు, పరిశ్రమ ప్రోత్సాహక అధికారులు పాల్గొన్నారు.

 వివిధ శాఖలతో సమీక్ష
సంగారెడ్డి జోన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య, మున్సిపల్ కమిషనర్లతో పాటు అనుబంధ శాఖల అధికారులతో వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, ఫైలేరియా, జపానీస్ ఎన్‌సెఫాలిటీస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న నినాదాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులను, డ్రెయిన్లను సమయానికి శుభ్రం చేయాలని సూచించారు.

సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో పెద్ద ఎత్తున కరపత్రాలు పంచాలని ఆదేశించారు. రెండు నెలల విరామం తర్వాత విద్యార్థులంతా పాఠశాలలకు వచ్చినందున వారి ఆరోగ్యాలను పరీక్షించాలని వైద్య, ఆరోగ్య శాఖాధికారిని సూచించారు. కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో తక్షణమే యాంటీ మలేరియా మందులు స్ప్రే చేయాలన్నారు.  జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి అమర్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్లు, మందులు అందుబాటులో ఉంచామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చక్రవర్తి మాట్లాడుతూ.. గ్రామాల్లో వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులను ఇప్పటికే తగ్గించామన్నారు. సమావేశంలో విద్యా, ఐసీడీఎస్, ఆర్‌డబ్ల్యుఎస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు