కాలయాపన చేయడమేంటి?

19 May, 2017 23:19 IST|Sakshi
కాలయాపన చేయడమేంటి?

ఆటంకాలు ఎదురైతే మా దృష్టికి తేవాలి
హంద్రీనీవా కాంట్రాక్టర్‌పై కలెక్టర్‌ ఆగ్రహం


హిందూపురం రూరల్‌ : హంద్రీనీవా కాలువ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాసులుపై కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తూముకుంట పారిశ్రామికవాడలో కొటిపి నుంచి కిరికెర పంచాయతీ అప్పలకుంట వరకు వచ్చే హంద్రీనీవా సప్లయ్‌ చానల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. చానల్‌ పారిశ్రామికవాడ సమీపంలో రైల్వే వంతెన, బెంగళూరు–హిందూపురం రహదారిని దాటి రావాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.

కాలువ నిర్మాణ పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. పనులు చేయకుండా కాలయాపన చేయడం ఏంటని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. అయితే కాలువ రైల్వే వంతెన దాటాల్సి ఉండటంతో పనుల్లో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్‌ సమాధానం చెప్పారు. కాలువ నిర్మాణ పనులు జూన్‌ నెలాఖరులోపు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఆయన వెంట ఇరిగేషన్‌ ఈఈ రామకృష్ణారెడ్డి, నారాయణనాయక్, హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్, తహసీల్దార్‌ చల్లా విశ్వనాథ్‌ తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టర్‌ సోమందేపల్లి మండలం నక్కలగుట్ట వద్ద హంద్రీనీవా కాలువ లిఫ్టింగ్‌ పాయింట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ హసీనాసుల్తానా పాల్గొన్నారు.

కూలీల సంఖ్య పెంచండి :
మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ, అమరాపురం, మడకశిర మండలాల్లో కూడా కలెక్టర్‌ పర్యటించారు. అమరాపురం మండలంలో ఉపాధి కూలీల హాజరు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమరాపురం మండలంలోని నాగోనపల్లి రైతు ఉలియప్పకు చెందిన వక్కతోటను కలెక్టర్‌ పరిశీలించారు. బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడంతో తోటలు ఎండుతున్నాయని తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. అనంతరం హేమావతిలోని సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు.

మరిన్ని వార్తలు