‘నారాయణ’ కోసమే..

30 Dec, 2016 01:16 IST|Sakshi
‘నారాయణ’ కోసమే..

స్కావెంజర్స్‌ కాలనీ తొలగించి మంత్రి నారాయణ
విద్యాసంస్థలు నెలకొల్పే కుట్ర భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ధర్నా
ఆ కాలనీవాసుల జోలికొస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధం
అక్కడే పట్టాలిచ్చిఇళ్లు నిర్మించి ఇవ్వాలి
  కార్మికులకు అండగా వైఎస్సార్‌సీపీ


తిరుపతి సిటీ:‘‘దళితులు.. అందులోనూ పేదలే కదా పొమ్మంటే పోతారులే అని పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లను ఖాళీ చేయించాలని చూస్తే ఖబడ్దార్‌’’ అంటూ  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు హెచ్చరించారు. తిరుపతి నగరం నడిబొడ్డున పారిశుద్ధ్య కార్మికులు నివాసాలుంటున్న స్కావెంజర్స్‌ కాలనీలో ఇళ్లను తొలగించి అక్కడ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలను నెలకొల్పేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. స్కావెంజర్స్‌ కాలనీలోని కార్మికుల ఇళ్లను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కార్మికులతో కలిసి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు డంపింగ్‌ యార్డ్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 4లక్షలమంది ప్రజలకు సంబంధించిన పారిశుధ్యాన్ని శుభ్రం చేసే కార్మికులు స్కావెంజర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఐదున్నర ఎకరాల్లో సమారు 381మంది కార్మికుల కుటుంబాలు గత 60 సంవత్సరాలకు పైబడి నివాసం ఉంటున్నాయని చెప్పారు. మంత్రి నారాయణ ఈ స్థలాన్ని కబ్జా చేసి కాలేజీలను కట్టుకోవడానికి కార్మికులను తరిమిగొట్టే ప్రయత్నానికి పూనుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడున్న కార్మికులకు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికృత మాల వద్ద ఇళ్లు కట్టించి ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కేవలం 36మందికి మాత్రమే అక్కడ 10 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఇరుకైన ఇళ్లను స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ నిర్మించే ఇళ్లలో ఇస్కా సమావేశానికి హాజరవుతున్న మంత్రి నారాయణ నిద్ర చేయాలని డిమాండ్‌ చేశారు.  జనవరి 5వ తేదీ లోగా కార్మికులంతా కాలనీని ఖాళీ చేయాలని మంత్రి నారాయణ చెప్పడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మంత్రి బెదిరింపులకు తాము భయపడేదిలేదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలు సంపాదించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కట్టబెట్టి ప్రజల అమోదం లేకుండా నారాయణ మంత్రి అయ్యారని ఏద్దేవా కరుణాకర రెడ్డి చేశారు. మంత్రి నారాయణను దళిత, గిరిజనులు పిడికిళ్లు బిగించి తరిమి తరిమి కొడతారని చెప్పారు. కార్మికులకు ఇక్కడే ఇళ్లపట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. న్యాయబద్ధంగా, శాంతియుతంగా తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి పోరాటాలు చేస్తామన్నారు.  

ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ స్కావెంజర్స్‌ కాలనీలో నిరుపేద దళిత, గిరిజన, బీసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేతనైతే వెంటనే ప్రస్తుతం వారు ఉన్నచోటే వారందరికీ పట్టాలిచ్చి  ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే స్కావెంజర్స్‌ కాలనీ పేరును మార్పు చేయాలని ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ధర్నాలో పార్టీ నేతలు బోయనపాటి మమత, ఎస్‌కె.బాబు, పుల్లూరు అమరనాథరెడ్డి, కట్టా గోపీయాదవ్, టి.వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేంద్ర, మునిరామిరెడ్డి,  దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, గీతా, కుసుమ, సాయి, శ్యామల, శాంతారెడ్డి, నాగిరెడ్డి, మురళీయాదవ్, శివకుమార్, తాళ్లూరి ప్రసాద్, హనుమంత నాయక్, బాలిశెట్టి కిషోర్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు