నిరుపేదలకు కార్పొరేట్‌ సాయం

12 Jan, 2017 01:48 IST|Sakshi
నిరుపేదలకు కార్పొరేట్‌ సాయం

మౌలిక సదుపాయాలకు సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించాలి
విశాఖ నగరఅభివృద్ధే ఇక్కడి పరిశ్రమలలక్ష్యం కావాలి
ముగిసిన పార్లమెంటరీ కమిటీ పర్యటన


విశాఖపట్నం: జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్నాయి. కానీ వాటి స్థాయికి తగ్గట్టుగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ(సామాజిక బాద్యత) కింద ఖర్చు చేయడం లేదు. ప్రతి పరిశ్రమ ఉదారంగా ముందుకు రావాలి. నిరుపేదలను ఆదుకోవాలి అని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పారిశ్రామిక వర్గాలను కోరారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ మూడురోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన గురువారం చమురు సంస్థలు, ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఎంపీ ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలోని కమిటీ నగరంలోని ఓ హోటల్‌లో బేటీ అయ్యింది. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ తదితర సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి వారికి పలు సూచనలు చేశారు. పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతగా ముందుకు రావాల్సిన ఆవసరం ఉందన్నారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడమే ఇక్కడున్న ప్రతి పరిశ్రమ లక్ష్యం కావాలన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా లేకపోవడంతో రాష్ట్రానికి, ముఖ్యంగా విశాఖకు కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. అందువల్ల ఉన్న పరిశ్రమలైనా ఉదారంగా ఆదుకోవాలని సూచించారు. సిటీకి పరిమితం కాకుండా గ్రామీ ణ, ఏజెన్సీ ప్రాంతాల నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని నిధులు ఖర్చు చేయాలన్నారు. అవసరమైతే సీఎస్‌ఆర్‌ నిధుల కేటాయింపులను పెంచాలని సూచించారు. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీలతోపాటు రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున ఖర్చు చేయాలని ఆయన కోరారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం కమిటీ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబై బయల్దేరి వెళ్లారు. ఎయిర్‌పోర్టులో హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు ఘనంగా వీడ్కోలు పలికారు.

రత్నాకర్‌కు పరామర్శ: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు దాడి రత్నాకరరావును ఎంపీ వి.విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో గాయపడిన రత్నాకర్‌ను సీతమ్మధారలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీతోపాటు రత్నాకర్‌ను పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, బీసీడీఎఫ్‌ రాష్ట్రాధ్యక్షుడు ఫక్కి దివాకర్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ సత్తి రామకృష్ణారెడ్డి, దక్షిణ కో ఆర్డినేటర్‌ కోలా గురువులు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కాంతారావులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు