అవినీతి రోగానికి ఏసీబీ చికిత్స

26 Jul, 2016 12:58 IST|Sakshi
  సింగరేణి మెడికల్ బోర్డు 
  అక్రమాల్లో కార్మిక నాయకులు, అధికారులు..?
  తెలంగాణ సర్కారు గుప్పిట నివేదిక..!
  గుర్తింపు ఎన్నికల ముందు బయటపెట్టే అవకాశం
 
మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : సింగరేణి మెడికల్ బోర్డుకు పట్టిన అవినీతి రోగానికి రాష్ట్ర ఏసీబీ తనదైన శైలిలో చికిత్స చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బోర్డులోని కొంతమంది అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్ల అనేక మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అదేశించింది. ఏసీబీ ఇచ్చిన నివేదికలో పలు కార్మిక  సంఘాలకు చెందిన అగ్రనాయకులతో పాటు కొంతమంది సింగరేణి ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ గుప్పిట పట్టుకున్న సర్కారు కొద్ది రోజుల్లో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో వాటిని బయటపెట్టే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా కేవలం తప్పులతో దొరికిన నాయకులను టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల్లో లబ్ధిపొందడానికి అధికార పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. 
 
కార్యకర్తల వద్దే నొక్కేశారు
జీవితకాలం సంఘానికి సభ్యత్వం చెల్లించారు. జెండాలు మోశారు. ఉద్యమంలో ముందు నిలబడి పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుపాలయ్యారు. ఆర్థికంగా నష్టపోయారు. ఇలా 25 నుంచి 30 ఏళ్లపాటు బొగ్గుబాయిలో పనిచేసి సంఘానికి అండగా నిలిచిన వారెందరో ఉన్నారు. తన కొడుక్కో, అల్లుడికో వారసత్వపు ఉద్యోగం పెట్టించడానికి మెడికల్ అన్‌ఫిట్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇంతకాలం చాకరీ చేశాం.. నాయకులు కనికరించకపోతారా అని ఆశపడితే.. ఒక్కో కార్యకర్త నుంచి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితుల ద్వారా తెలిసింది. పని ఏమైంది నాయకా అంటే తప్పించుకు తిరుగుతున్నారని, కనీసం ఇచ్చిన పైసలైనా ఇమ్మంటే ‘నేనేం చేయాలె నా పైన ఉన్నోడికి ఇచ్చిన.. అక్కడి నుంచి వచ్చినప్పుడే నీకిస్తా.. అప్పటిదాకా నా ఇంటికి రాకు’ అంటూ దబారుుస్తున్నారని కొందరు వాపోయూరు. 
 
నాయకులే టార్గెట్
పలు కార్మిక సంఘాలకు చెందిన కొందరు నాయకులు మెడికల్ అన్‌ఫిట్ కోసం కార్మికుల నుంచి భారీగా వసూలు చేసి మోసం చేశారని ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. ఇందులో ప్రతిపక్ష సంఘాలలోని ముఖ్య నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం నాయకుల్లో కొందరి భాగస్వామ్యం ఉన్నట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఏసీబీ నివేదికను అస్త్రంగా ఉపయోగించుకుంటే సొంతవారు కూడా బలయ్యే అవకాశం ఉంది. అరుుతే వారిని కాపాడుకోవడానికి అందరినీ ఎన్నికల సమయం నాటికి ఏసీబీకి అప్పగించి, కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏసీబీ నివేదికలో వాస్తవాలు ఉన్నప్పటికీ కార్మిక వర్గంలో తన సంఘంపై వచ్చిన వ్యతిరేకతను పోగొట్టడానికి, వివిధ సంఘాలకు చెందిన నాయకులు చేసిన అవినీతిని ముందుకు తీసుకువస్తే కార్మికుల నుంచి సానుభూతి పొందవచ్చని అధకార పార్టీ అలోచనగా తెలుస్తోంది.  
  
ఆత్మరక్షణలో అక్రమార్కులు
మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తానని కార్మికుల నుంచి వసూలు చేసిన నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. ఓ ప్రతిపక్ష సంఘానికి చెందిన సీనియర్ నాయకుడు ఈ గండం నుంచి తప్పించమని దక్షిణ తెలంగాణకు చెందిన అధికార పార్టీ మంత్రితో ప్రాదేయపడుతున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అరుుతే ఆ నాయకుడిని చేరదీసి బయట పడేస్తే తన పదవికే ముప్పు వస్తుందనే ఆలోచనలో సదరు మంత్రి ఉన్నట్టు సమాచారం. బయట పడే అవకాశం లేనప్పటికీ ఎన్నికల నాటికి చెప్పినట్టు నడుచుకుంటే ఇబ్బంది లేకుండా చూస్తామనే హామీ కోసం ఆ నాయకుడు ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ సంఘంలో ఉంటారో వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలు