పంటలు ఎండి.. అప్పులు తీరక...

22 Aug, 2016 00:03 IST|Sakshi
– రంగాపూర్‌లో రైతు ఆత్మహత్య 
– మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు
అచ్చంపేట రూరల్‌ : ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం.. ఆ రైతు తమకున్న పొలంలో పంటలు వేసినా వర్షాభావంతో ఎండిపోయాయి.. దీంతో వాటికోసం చేసిన అప్పులు తీర్చలేక అతను ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలంలోని రంగాపూర్‌కు చెందిన కేతావత్‌ టీక్యా (35) కు శివారులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. అందులో ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, మిరప వేశాడు. వీటికోసం సుమారు మూడు లక్షలను ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి తెచ్చాడు.
 
                వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో పంటలు ఎండిపోతుండటం, చేసిన అప్పులు తీర్చడం ఎలాగని మనోవేదనకు గురైన అతను శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగుమందు తాగాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మతి చెందాడు. ఈయనకు భార్య బుజ్జితోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్‌ఐ ఖాద్రీ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
మరిన్ని వార్తలు